40 మంది అధికారులకు నెగెటివ్
ABN , First Publish Date - 2020-04-01T08:05:19+05:30 IST
రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న 40 మంది ఉన్నతాధికారులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగెటివ్‌నే వచ్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వీరికి పరీక్షలు

గాంధీ, ఛాతీ, ఫీవర్ వైద్యులకూ ఓకే
ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు
హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న 40 మంది ఉన్నతాధికారులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగెటివ్‌నే వచ్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వీరికి పరీక్షలు నిర్వహించారు. ఉన్నతస్థాయిలో ఉన్న ఈ అధికారులంతా రేయింబవళ్లు పనిచేస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లి కరోనా చికిత్స అందిస్తోన్న వైద్యులను కలిసి మాట్లాడుతున్నారు. వారిలో కొంతమందికి జలుబు, దగ్గు రావడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ నెగిటివ్‌నే వచ్చింది.
ఇక నుంచి నేరుగా సమీక్షలు చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన అధికారులంతా ఒకేచోటే కూర్చుని సమావేశమైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక వైద్య మంత్రి ఈటల రాజేందర్ కూడా విలేకరుల సమావేశాలను చాలా తక్కువగా నిర్వహించనున్నారు. దానికి బదులు మీడియా ప్రకటన విడుదల చేయనున్నారు.