చదివిన కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలు

ABN , First Publish Date - 2020-09-17T08:28:12+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థి చదివిన

చదివిన కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలు

  • పరీక్ష సమయం రెండు గంటలే
  • నేటి నుంచి ఓయూ పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌16 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో  చివరి సెమిస్టర్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థి చదివిన కాలేజీ(సెల్ఫ్‌ సెంటర్‌)లోనే పరీక్ష రాసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  పరీక్షల సమయాన్ని కూడా తగ్గించారు. కేవలం రెండు గంటల్లోనే జవాబులు రాసే విధంగా ప్రశ్న పత్రాన్ని  అధికారులు సిద్ధం చేశారు. మాస్క్‌ ఉంటేనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్‌, బీఈడీ, బీపీఈడీ, బీసీఏ, బీఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు వచ్చేనెల 14 వరకు జరుగనున్నాయి. అదేవిధంగా ఎంబీఏ పరీక్షలను అక్టోబరు 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. యూనివర్సిటీ పరిధిలో సుమారు 125కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో  అన్ని రకాల కొవిడ్‌-19 జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఒక గదిలో  12 నుంచి 15మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.


ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు హాస్టల్‌  వసతి కల్పించేందుకు చర్యలు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓయూ పరిధిలోని డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సుమారు 300 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిగ్రీ చివరి సెమిస్టర్‌ రాసే విద్యార్థులు సుమారు 65వేలకు పైగా ఉండగా, రోజుకు ఒక కోర్సుకు ఒక పరీక్ష చొప్పున రెండు షిప్టులలో నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఈసారి పరీక్షలకు హాజరు కాలేని వారికి మరోసారి స్పెషల్‌ సప్లిమెంటరీ నిర్వహిస్తామని,  వారిని రెగ్యులర్‌ విద్యార్థులుగానే  గుర్తిస్తామని ఓయూ ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - 2020-09-17T08:28:12+05:30 IST