ఈడీ కేసుల విచారణపై జనవరి 11న ఉత్తర్వులు
ABN , First Publish Date - 2020-12-19T08:15:09+05:30 IST
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ పూర్తయ్యాకే ఈడీ కేసులను విచారించాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ పూర్తయ్యాకే ఈడీ కేసులను విచారించాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై జనవరి 11న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ప్రకటించారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగానే ఈడీ ఫిర్యాదులు నమోదు చేసిందన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం రెండు కేసులనూ ఒకే కోర్టు విచారణ చేపట్టాల్సి ఉందనిన్నారు. ఇది ప్రత్యేక చట్టమని, సీబీఐ కేసుతో సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని ఈడీ తరఫు న్యాయవాది టీవీ సుబ్బారావు తెలిపారు.
జగన్ అక్రమాస్తులకు సంబంధించి నమోదు చేసిన 11 కేసుల్లో ఆరింటి విచారణను సీబీఐ కోర్టు ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. పెన్నా, రఘురాం(భారతి) సిమెంట్స్, జగతిలో పెట్టుబడులు, వాన్‌పిక్, రాంకీ వ్యవహారాలపై కేసుల విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో ఏ-6గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో మెమో వేశారు. సరిహద్దు వివాదం తేలేదాకా విచారణ కొనసాగించకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశామని, ఆ నిర్ణయం వెలువడేదాకా విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల23కు వాయిదా వేశారు.