ఓపీఎస్‌కు అర్హులైన సీపీఎస్‌ ఉద్యోగుల వివరాలివ్వండి

ABN , First Publish Date - 2020-03-23T09:42:25+05:30 IST

కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగుల్లో అర్హులైన వారిని ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం(ఓపీఎ్‌స)లోకి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్థిక

ఓపీఎస్‌కు అర్హులైన  సీపీఎస్‌ ఉద్యోగుల వివరాలివ్వండి

అన్ని శాఖలకు ఆర్థిక శాఖ లేఖ 

వీరికి ఓపీఎస్‌ అమలు చేస్తే 10-12వేల మందికి లబ్ధి

హైదరాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగుల్లో అర్హులైన వారిని ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం(ఓపీఎస్‌)లోకి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు రాసిన లేఖ ఇందుకు బలం చేకూర్చుతోంది. ఓపీఎ్‌సకు అర్హులైనప్పటికీ.. సీపీఎస్‌ వర్తించిన ఉద్యోగుల వివరాలను అందించాలని అన్ని శాఖలను ఆయన ఆదేశించారు. 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తై ఆ తర్వాత నియమితులైన(పోస్టింగ్‌ పొందిన) వారి వివరాలను ఇవ్వాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ సమాచారాన్ని అందించాలని కోరారు. కేంద్రం ఆదేశాలతో నాటి రాష్ట్ర ప్రభుత్వం 2004 సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోనూ ఓపీఎ్‌సకు బదులుగా సీపీఎ్‌సను అమలు చేయాలని నిర్ణయించింది.


ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది నూతన ఉద్యోగులు కొత్త పెన్షన్‌ విధానంలోకి వచ్చారు. అయితే ఇందులో కొంత మంది ఉద్యోగులు మాత్రం వారి తప్పు లేకుండానే, ఓపీఎ్‌సకు అర్హులైనప్పటికీ సీపీఎ్‌సలోకి చేర్చబడ్డారు. అంటే ఈ ఉద్యోగుల నియామక ప్రక్రియ నూతన పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడడానికి ముందే పూర్తయింది. కానీ వారికి పోస్టింగ్‌ ఆర్డర్లు మాత్రం ఉత్తర్వులు వెలువడ్డాక ఇచ్చారు. దీంతో వారిని కూడా సీపీఎ్‌సలోనే కలిపేశారు. అయితే తమను ఓపీఎ్‌సలోకి తీసుకురావాలని కోరుతూ ఆ ఉద్యోగులు ఎప్పటినుంచో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.


ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం గత నెలలో కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తై ఆ తర్వాత నియమితులైన(పోస్టింగులు) వారిని ఓపీఎ్‌సలోకి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇది కేంద్ర  ఉద్యోగులకు మాత్రమే పరిమితమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉద్యోగులు కోరారు. దీనిపై చర్చించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చింది? పరీక్ష ఎప్పుడు పూర్తయింది? ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? ఉత్తర్వులు ఎప్పుడు ఇచ్చారు? అనే వివరాలు అందించాలని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మాదిరిగా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో సుమారు 10-12వేల మంది ఉద్యోగులు సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ పెన్షన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2020-03-23T09:42:25+05:30 IST