విపక్షాలు.. దుష్ట శక్తులు

ABN , First Publish Date - 2020-10-07T08:28:06+05:30 IST

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక రాష్ట్రంలో విపక్షాలు అసూయ

విపక్షాలు.. దుష్ట శక్తులు

 అసూయ రాజకీయాలు చేస్తున్నాయ్‌ : కేటీఆర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక రాష్ట్రంలో విపక్షాలు అసూయ రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దుష్ట శక్తులుగా మారాయని మండిపడ్డారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఓటర్లతో కేటీఆర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. ‘ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుండటం కూడా విపక్షాలకు కంటగింపుగా మారింది. ఈక్రమంలోనే కులాలు, మతాల పేరుతో ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నింటినీ టీఆర్‌ఎస్‌ ప్రజా క్షేత్రంలోనే సమర్థంగా ఎదుర్కొంటుంది.


పార్టీకి తొలి నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అండగా ఉంటోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు. పూర్వ నిజామాబాద్‌ జిల్లాలో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ప్రత్యేక నిధుల విషయంలో ఒక పరిష్కారంతో ముందుకు వస్తామని తెలిపారు. మునిసిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సమస్యలు సైతం తమకు తెలుసునని చెప్పారు. ప్రత్యేక నిధులతో అన్ని వార్డుల్లోనూ పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాగేలా చూస్తామని చెప్పారు. 

Read more