హమ్మయ్య! రెండే కేసులు
ABN , First Publish Date - 2020-04-28T09:01:13+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వారం రోజులుగా తగ్గుతోంది. సోమవారం 159 మందికి పరీక్షలు జరపగా అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ హైదరాబాదీలే. ఒకరు పల్లీలవ్యాపారి కాగా..

- హైదరాబాద్‌లో ఇద్దరికి మాత్రమే పాజిటివ్
- డిశ్చార్జ్ అయినవారు 16 మంది!
- ఆరు రోజుల్లో నమోదైనవి 75 కేసులే
- రాష్ట్రంలో కట్టడి ప్రాంతాల కుదింపు
- కేసులు తగ్గడంతో సర్కారు నిర్ణయం
- గతంలో ఉన్నది 243.. ప్రస్తుతం 159
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వారం రోజులుగా తగ్గుతోంది. సోమవారం 159 మందికి పరీక్షలు జరపగా అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ హైదరాబాదీలే. ఒకరు పల్లీలవ్యాపారి కాగా.. మరొకరు హౌస్‌సర్జన్ పూర్తిచేసిన యువతి. ఈ రెండు కేసులతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటిదాకా వైరస్ పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 1003కి చేరుకుంది. సోమవారం వైరస్ నుంచి 16 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 332కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 646 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా వైరస్ కారణంగా ఎవ్వరూ చనిపోలేదని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నెల రోజుల నుంచి వరుసగా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మార్చి 25న రాష్ట్రంలో రెండే కేసులు నమోదవ్వగా.. మళ్లీ నెల రోజుల తరువాత రెండు కేసులే వచ్చాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ పదిలోపు కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. ఏప్రిల్ 15న ఆరు, 25న ఏడు కేసులు నమోదయ్యాయి. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో కేవలం 75 పాజిటివ్ కేసులే నమోదయ్యాయి.
ఈ నెలలో నమోదైనవి 906 కేసులు కాగా.. మార్చిలో 97 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. కాగా.. సోమవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో జీరో కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఆ 12 జిల్లాలు.. సంగారెడ్డి, భద్రాద్రి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి, వరంగల్ రూరల్. కాగా మంగళవారం నాటికి జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, సిరిసిల్ల కరీంనగర్, నల్గొండ జిల్లాలో కరోనా పేషెంట్లంతా కూడా డిశ్చార్జ్ అవుతారని.. దీంతో రాష్ట్రంలో మొత్తం 21 జిల్లాలు కరోనారహితం కానున్నాయని అధికారులు తెలిపారు. అటు గద్వాల జిల్లాలో అనుమానిత లక్షణాలున్నవారికే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ లక్షణాలున్న వారు లేకపోవడంతో ఏప్రిల్ 24 నుంచి నమూనాలను సేకరించడం నిలిపేశారు. 4 రోజులుగా అక్కడ కేసులు నమోదు కానందున జిల్లాలోని మూడు క్వారంటైన్లను ఎత్తేశారు.