విద్యాసంస్థలను తెరిచినా పిల్లలను పంపలేం
ABN , First Publish Date - 2020-10-27T09:31:36+05:30 IST
కంప్యూటర్ తెర మీద ఉపాధ్యాయుల బోధన.. ఎదురుగా కూర్చుని వింటూ నోట్సు రాసుకునే విద్యార్థులు! ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు కొనసాగనుంది?

తల్లిదండ్రుల్లో 83శాతం నిశ్చితాభిప్రాయం
వెళ్లేందుకు పిల్లల్లోనూ 67శాతం విముఖత
విద్యాసంస్థలను తెరవడం సమంజసం కాదు
తల్లిదండ్రుల్లో 79శాతం మంది మాట ఇదే
కరోనా రూల్స్ పాటిస్తారనే నమ్మకం లేదని స్పష్టం
ఆన్‌లైన్ క్లాసులతో ప్రయోజనం లేదనీ పెదవి విరుపు
‘ఆంధ్రజ్యోతి’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సర్వే
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కంప్యూటర్ తెర మీద ఉపాధ్యాయుల బోధన.. ఎదురుగా కూర్చుని వింటూ నోట్సు రాసుకునే విద్యార్థులు! ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు కొనసాగనుంది? ఇప్పటికే విద్యాసంవత్సరంలో దాదాపు ఐదు నెలల కాలం గడిచిపోయింది. ‘ఆన్‌లైన్ క్లాసులు’ జరుగుతున్నా కూడా బోధన పరంగా విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని నష్టపోయారు. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఇప్పటికప్పుడు పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటే తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా? బడులు, కాలేజీల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ పరంగా నిర్దేశించిన నిబంధనలను పక్కాగా పాటిస్తారని తల్లిదండ్రులు నమ్ముతున్నారా? అసలు బడులు, కాలేజీలకు వెళ్లే విషయంలో పిల్లలు ఏమనుకుంటున్నారు? ఈ విషయాలపై ‘ఆంధ్రజ్యోతి’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సర్వేను నిర్వహించారు.
సర్వే ఫలితాలు
- కొవిడ్-19 సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం విద్యా సంస్థలను పునఃప్రారంభించడం సమంజసం కాదని తల్లిదండ్రుల్లో 79శాతం తేల్చిచెప్పారు. అయితే తమ పిల్లలకు నష్టం జరుగుతోందని, విద్యా సంస్థలను పునఃప్రారంభించక తప్పదని 20శాతం అభిప్రాయపడ్డారు.
- ఒకవేళ బడులు, కళాశాలలు తెరుచుకుంటే అక్కడ కరోనా వ్యాప్తి నివారణ పరంగా జాగ్రత్తలు తీసుకుంటారని తాము భావించడం లేదని తల్లిదండ్రుల్లో 85శాతం అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటిస్తారని నమ్ముతున్నామని 14శాతం పేర్కొన్నారు.
- విద్యాసంస్థలను పునఃప్రారంభమైతే వెళ్లాలని పిల్లలు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తల్లిదండ్రుల్లో 67శాతం లేదు అని స్పష్టం చేశారు. పిల్లలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని 32శాతం పేర్కొన్నారు.
- విద్యాసంస్థలను తెరిచినా కూడా పిల్లలను పంపేందుకు సిద్ధంగా లేమని తల్లిదండ్రుల్లో 83శాతం స్పష్టం చేశారు. 16శాతం మాత్రం పంపుతామని చెప్పారు.
- ఆన్‌లైన్ విద్యా విధానం పట్ల ప్రయోజనం ఉందా? అన్న ప్రశ్నకు ‘కొంత వరకు పర్వాలేదు’ అని తల్లిదండ్రుల్లో 70శాతం మంది చెప్పారు. ‘అస్సలు ఉపయోగం లేదు’ అని 21శాతం మంది పేర్కొన్నారు. ‘ప్రయోజనం ఎంతో ఉంది’ అని 6శాతమే చెప్పడం గమనార్హం.