ఇంటర్‌ ఫలితాలరోజే ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-06-04T09:31:04+05:30 IST

రాష్ట్రంలోని ‘డిగ్రీ’ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి

ఇంటర్‌ ఫలితాలరోజే ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌

  • సెప్టెంబరు తొలి వారంలో డిగ్రీ తరగతులు షురూ  
  • ప్రణాళిక సిద్ధం చేస్తున్న ఉన్నత విద్యామండలి 

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ‘డిగ్రీ’ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సారి ప్రవేశాల ప్రక్రియలో జాప్యం నేపథ్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు ప్రకటించినరోజే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యే అవకాశముంది. ఆరు విశ్వవిద్యాలయాల పరిధిలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లోని 200 కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. గత ఏడాది దోస్త్‌ నోటిఫికేషన్‌ మే 22న విడుదలవ్వగా, మూడు విడతల్లో ప్రవేశాలు నిర్వహించి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించారు.


ఈ మొత్తం ప్రక్రియ 38 రోజుల్లో పూర్తయింది. ఈ సారి డిగ్రీ తరగతులు సెప్టెంబరు 1 నుంచి నిర్వహించవచ్చన్న యూజీసీ మార్గదర్శకాల నేపథ్యంలో.. ఆగస్టు నెలాఖరులోపు ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు.  ఇక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మాడ్రన్‌ లాంగ్వేజ్‌ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 861 మంది విద్యార్థులకుగాను 834 మంది (97శాతం) హాజరయ్యారు.  


ఇంటర్‌ మెమోపై ‘దోస్త్‌’ వివరాలు

నోటిఫికేషన్‌ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులయ్యే విద్యార్థులందరికీ దోస్త్‌ ద్వారా ప్రవేశాల ప్రక్రియను తెలిపేందుకు ఇంటర్‌ మెమో వెనక వివరాలు ప్రచురిస్తున్నాం. అలాగే ఉత్తీర్ణులైన ఇంటర్‌ విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలోనూ సూచనలు అందించనున్నాం.  

ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, కన్వీనర్‌ ‘దోస్త్‌’ 

Updated Date - 2020-06-04T09:31:04+05:30 IST