చైన్ స్కీమ్ పేరుతో చీటింగ్
ABN , First Publish Date - 2020-12-29T04:44:07+05:30 IST
చైన్ స్కీమ్ పేరుతో చీటింగ్

15 వేల మంది నుంచి రూ.3.50 కోట్ల వసూలు
నిందితుడి అరెస్టు
వరంగల్ అర్బన్ క్రైం, డిసెంబరు 28 : తమ సం స్థలో కొంత పెట్టుబడి పెట్టి సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంలో కమీషన్లు ఇస్తామంటూ ఓ మల్టీలెవల్ చైన్ మార్కెటింగ్ సంస్థ పలువురిని మోసగించింది. గొలుసుకట్టు పద్ధతిలో ప్రజల నుంచి పెట్టుబడులను తీసుకొని ఓ వ్యక్తి రూ.3.50కోట్లు వసూలు చేసి పరారయ్యా డు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఎట్టకేలకు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను వరంగల్ సెంట్రల్‌జోన్ డీసీపీ పుష్ప సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించారు. వరంగల్ కొత్తవాడకు చెందిన పార్వతి శ్రీనివాస్ లాక్‌డౌన్ సమయంలో పియర్ల్‌వైన్ అనే మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా సన్నిహితులు, తెలిసినవారిని సంస్థలో చేర్చుకుని చైన్‌సిస్టం ద్వారా పెట్టుబడులు పెట్టించాడు. ముందుగా రూ.2,250 చెల్లించినవారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి లావాదేవీలు నడిపేవాడు. కొత్త సభ్యులను చేర్పిస్తే నెలవారీ కమీషన్లు ఇస్తానని ఆశ చూపాడు. ఇలా 15వేల మందిని సభ్యులుగా చేర్చుకుని అకౌంట్స్ ఓపెన్ చేశాడు. 25మందిని ఏజెంట్లుగా పెట్టుకుని రూ.3.50కోట్లు కాజేసి పరారయ్యాడు. బాధితులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సోమవారం శ్రీనివాస్ వరంగల్ చౌరస్తాకు వచ్చాడని తెలిసి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను ఇన్‌చార్జి సీపీ అభినందించారు.