నేటి నుంచి ‘ఆన్‌లైన్’
ABN , First Publish Date - 2020-09-01T08:18:09+05:30 IST
ఆన్‌లైన్ బోధనకు అంతా సిద్ధమైంది. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్‌లైన్ తరగతులు నేటినుంచి ప్రారంభం కానున్నాయి

- 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు
- టీసాట్‌లో 126 గంటల ప్రసారాలు
- ఐఐటీహెచ్‌లోనూ నేటి నుంచే..
హైదరాబాద్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బోధనకు అంతా సిద్ధమైంది. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్‌లైన్ తరగతులు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్ యాదగిరి, టీసాట్ ఛానల్‌లో వివిధ తరగతుల వారీగా ప్రసార సమయాలను ఇప్పటికే ప్రకటించారు. ఉపాధ్యాయుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సైతం సమాచారం అందించారు. తొలిరోజు 6-10వ తరగతి విద్యార్థులకు ప్రతి తరగతికి రెండు సబ్జెక్టుల చొప్పున ప్రసారం కానున్నాయి. ప్రతి సబ్జెక్టుకు సెషన్ 30 నిమిషాల పాటు ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 14 వరకు షెడ్యూల్ ప్రకటించగా.. ఇందులో పాఠశాల విద్యకు సంబంధించి శని, ఆదివారాలు సెలవులు పోగా 10రోజులు, ఇంటర్‌లో ఆదివారం సెలవు పోను 12 రోజులు కొనసాగనున్నాయి. పాఠశాల విద్యకు రోజుకు 6 గంటలు, ఇంటర్‌కు రోజుకు ఆరున్నర గంటల చొప్పున 10 రోజుల్లో మొత్తం 126 గంటలపాటు ప్రసారాలు ఉంటాయని టీసాట్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. పాఠశాల స్థాయిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4-30 వరకు వివిధ తరగతులకు 30 నిమిషాల చొప్పున ప్రసారాలు ఉన్నాయి. శని, ఆదివారాల్లో ప్రసారాలు ఉండవు. ఇంటర్ తరగతుల ప్రసారాలు ఆదివారం మినహా 6 రోజులు ఉంటాయి. ఐఐటీ హైదరాబాద్ సైతం ఆన్‌లైన్ ప్రసారాలను నేటినుంచి ప్రారంభించనుంది.