ఓయూలో ఆన్‌లైన్‌లో తరగతులు
ABN , First Publish Date - 2020-04-12T09:24:14+05:30 IST
ఉస్మానియా యూనివర్సిటీలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా వర్సిటీకి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు నష్టం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా వర్సిటీకి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు నష్టం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వర్సిటీ అకడమిక్ ప్లాన్ ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఓయూలో ఆర్ట్స్, సైన్స్, లా, ఇంజనీరింగ్, కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్.. ఇలా 8 వరకు కాలేజీలు, 53 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో అకడమిక్ ప్లాన్ దెబ్బతినడంతోపాటు 20 వేల మంది విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్‌లైన్ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విద్యార్థుల నంబర్లను సేకరించి విభాగాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆయా గ్రూపుల్లో ప్రతి రోజూ ఉదయం 10గంటలకు సబ్జెక్టుల సమాచారం ఇస్తున్నారు. రెండు గంటల తర్వాత సంబంధింత సబ్జెక్ట్‌కు సంబంధించి విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ప్రొఫెసర్లు జవాబులిస్తున్నారు. వీటిన్నింటినీ ప్రిన్సిపాల్స్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇక, కొన్ని డిపార్ట్‌మెంట్లు జూమ్ యాప్‌ను వినియోగిస్తున్నాయి. దీని ద్వారా వి ద్యార్థులతో నేరుగా అఽధ్యాపకులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.