ఆన్‌లైన్ రిజర్వేషన్.. వలస కూలీలకు శాపం!
ABN , First Publish Date - 2020-06-11T08:35:36+05:30 IST
ఆన్‌లైన్ రిజర్వేషన్.. వలస కూలీలకు శాపం!

రైల్వేస్టేషన్ పరిసరాల్లో రోజుల తరబడి పడిగాపులు
రెజిమెంటల్ బజార్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో టిక్కెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతించడం వందలాది మంది వలస కూలీలకు శాపంగా మారింది. బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీల జీవితాలను కొవిడ్ చిన్నాభిన్నం చేయగా, సొంతూళ్లకు వెళ్లి కలో, గంజో తాగి బతుకుదామనుకుంటున్న వారికి రైల్వే రిజర్వేషన్ అవరోధాలను సృష్టిస్తోంది. పని చేస్తున్న చోట యజమానులు ఉపాధి లేదంటూ తరిమేస్తుండగా, స్వస్థలాలకు వెళ్లేందుకు రైళ్లలో రిజర్వేషన్ లభించక రోజుల తరబడి ఫుట్‌పాత్‌లపై తల దాచుకుంటున్నారు. ఐదు రోజులుగా పలువురు వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లే సమయం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని ఫుట్‌పాత్‌లపై నిరీక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకుని, రైలు ప్రయాణం ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు..వారికి ఆహారం, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాయి. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలకడంతో వలస కూలీలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.
వెయిటింగ్ లిస్ట్ వస్తోంది
మేము పని చేసే చోట పని లేదంటూ వెళ్లగొట్టారు. రైళ్లు నడుస్తున్నాయని తెలియడంతో మా ఊళ్లకు వెళదామని పెట్టే బేడా సర్దుకుని వచ్చాము. రైల్వే స్టేషన్‌లో టిక్కెట్లు ఇవ్వడం లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తే వెయిటింగ్ లిస్టు వస్తోంది. ఎటు పోవాలో తెలియక ఇక్కడే ఫుట్‌పాత్‌లపై ఉంటున్నాము.
- మంగున్ యాదవ్ (బీహార్)
మాకు ప్రాధాన్యమివ్వాలి
శ్రామిక్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వలస కూలీలను ఉచితంగా అన్ని వసతులతో పంపించారు. ఇప్పుడు డబ్బులు పెట్టి వెళదామన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వలస కూలీలకు రైళ్లలో మొదటి ప్రాధాన్యమివ్వాలి. - సంజయ్ (బీహార్)