బస్సుల్లో.. మాస్క్‌ లేకుండానే!

ABN , First Publish Date - 2020-12-27T08:26:13+05:30 IST

కరోనా ప్రభావం ఇంకా సమసిసోలేదు.. పైగా ప్రజల్లో సెకండ్‌ వేవ్‌ ఆందోళన కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా

బస్సుల్లో.. మాస్క్‌ లేకుండానే!

కొందరు ప్రయాణికుల తీరుతో ఇతరులకు ఇబ్బంది..

నగరంలో క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ

8 7 వేల బస్సులకు డిమాండ్‌.. నడుస్తున్నవి 1700 మాత్రమే

 అయినా.. బస్సుల సంఖ్యను పెంచని ఆర్టీసీ

 ప్రయాణికుల్లో కానరాని సామాజిక దూరం 


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం ఇంకా సమసిసోలేదు.. పైగా ప్రజల్లో సెకండ్‌ వేవ్‌ ఆందోళన కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాల్సి ఉండగా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌ లేకుండా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు సమస్యగా మారుతున్నారు. దీనికితోడు నగరంలో ప్రయాణికుల రద్దీ పెరిగినా.. బస్సుల సంఖ్యను ఆర్టీసీ పెంచకపోవడంతో సామాజిక దూరం కూడా పాటించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.


రాష్ట్రం లో కరోనా ప్రారంభంలో సిటీ బస్సులను డిపోలకే పరిమితం చేసిన ఆర్టీసీ.. ఆ తరువాత కొవిడ్‌ నిబంధనల సడలింపుతో 50 శాతం బస్సులను నడుపుతోంది. డిపోల్లో ప్రతి రోజూ బస్సులను శానిటైజ్‌ చేయడంతోపాటు ఆర్టీసీ సిబ్బందికి సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ఽధరించాలనే నిబంధనను కూడా విధించింది.

కానీ, నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించకపోవడంతో కొందరు ప్రయాణికులు మాస్క్‌ లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇది తోటి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. దీనికితోడు పలు రూట్లల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో బస్సుల్లో సామాజిక దూరం పాటించే పరిస్థితులు కనిపించడం లేదు. రద్దీ రూట్లలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. 


ప్రయాణికులు పెరిగినా.. అవే బస్సులు..

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి గ్రేటర్‌లో రోజూ 3750 బస్సులు నడవగా.. 33 లక్షల మంది ప్రయాణాలు సాగించేవారు. ఆ తరువాత కరోనా లాక్‌డౌన్‌తో బస్సులు నిలిచిపోగా, నిబంధనల సడలింపుల అనంతరం 50 శాతం బస్సులు రోడ్డెక్కాయి. తొలుత ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నా.. మూడు వారాలుగా క్రమంగా పెరుగుతోంది. నవంబరులో బస్సుల్లో 30-35 శాతం వరకు ఉన్న ఆక్యుపెన్సీ రేషియో.. డిసెంబరులో 45 శాతం వరకు పెరిగింది. దీంతో బస్సుల్లో రద్దీ కూడా పెరుగుతోంది.


ప్రస్తుతం నగర వ్యాప్తంగా రోజూ 1700 బస్సులు నడుస్తుండగా.. 14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగక పోవడంతో రద్దీ సమయాల్లో కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, కోఠి, మెహిదీపట్నం, అమీర్‌పేట, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంటుందని, ఈ రూట్లలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో ప్రయాణికులకు మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు చెప్పేందుకు ఆర్టీసీ సూపర్‌ వైజర్లను నియమించాలని సూచిస్తున్నారు. 


ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం..

నగరంలో ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్‌లో ప్రతిరోజూ సుమారు 50 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా.. వారిలో సగం మంది అవసరాలు తీర్చేలా కూడా ఆర్టీసీ బస్సులను నడపడంలేదు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. అది ప్రకటనలకే పరిమితమవుతోంది. గ్రేటర్‌లో 7 వేల బస్సుల డిమాండ్‌ ఉందని, అందులో సగం బస్సులు కూడా ఆర్టీసీ నడపకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను అశ్రయించాల్సి వస్తోందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. 


Updated Date - 2020-12-27T08:26:13+05:30 IST