వ్యర్థాల తరలింపునకు నెల!

ABN , First Publish Date - 2020-07-19T06:57:42+05:30 IST

పాత సచివాలయ భవనాల వ్యర్థాల తరలింపును నెల రోజుల్లోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా నిర్దేశించుకున్న...

వ్యర్థాల తరలింపునకు నెల!

సచివాలయ కూల్చివేతకు రూ.5.72 కోట్లు  

ఫర్నిచర్‌ సామగ్రే 500 టన్నులు


హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పాత సచివాలయ భవనాల వ్యర్థాల తరలింపును నెల రోజుల్లోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం, ఈనెల 13 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై వచ్చే నెల 12వ తేదీకల్లా పూర్తి కావాల్సి ఉంది. ఆగస్టు 10 నుంచి స్థలాన్ని చదును చేయాల్సి ఉంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతిపాదిత షెడ్యూలు అమలులో జాప్యం జరిగే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ వర్గాలు తెలిపాయి. కూల్చివేస్తున్న సచివాలయ భవన సముదాయాలు 25.50 ఎకరాల్లో 9.87 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని కూల్చివేయడం ద్వారా సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల కాంక్రీటు, కలప, రాతికట్టడాలు, విద్యుత్తు పరికరాలతో పాటు ఇతర వ్యర్థాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఫర్నిచర్‌ సామగ్రే 500 టన్నులు ఉండడం విశేషం. డీ బ్లాక్‌ నుంచి అత్యధికంగా 24 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎల్‌ బ్లాక్‌ (18,720 మె.టన్నులు), జే బ్లాక్‌ (14,500 మె.టన్నులు)లు ఉన్నాయి. మొత్తం కూల్చివేతకు ఒక సంస్థ రూ.7.45 కోట్లు కోట్‌ చేయగా, మెస్సర్స్‌ ఎడిఫిసీ అనే సంస్థ రూ.5.72 కోట్లకు కోట్‌ చేసింది. 

Updated Date - 2020-07-19T06:57:42+05:30 IST