బోనాల ఉత్సవాల్లో కరోనా సోకకుండా ఆరోగ్య చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-06-18T22:36:53+05:30 IST
పాతబస్తీలో రానున్న ఆషాఢబోనాల ఉత్సవాల్లోకరోనా వైరస్ సోకకుండా పండగ ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లు చేయాలని ఆలయాలకు పనిచేసే వృత్తిదారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
హైదరాబాద్: పాతబస్తీలో రానున్న ఆషాఢబోనాల ఉత్సవాల్లోకరోనా వైరస్ సోకకుండా పండగ ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లు చేయాలని ఆలయాలకు పనిచేసే వృత్తిదారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. తరతరాలుగా వస్తున్న బోనాల పండుగ సంప్రదాయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి తగిన ఆరోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేయాలని సంఘం అధ్యక్షులు మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి బోనాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు జనగం మధుసూదన్‌గౌడ్‌కు వృత్తిదారుల సంగం ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.
బోనాల ఊరేగింపులో ప్రధానంగా ఘట్టాల ప్రతిష్టాపన, తొట్టెల ఊరేగింపు, బలిగంప ఊరేగింపు అమ్మవారికి శాంతి కళ్యాణం, భవిష్యవాణిని వినిపించే రంగం కార్యక్రమాలను నిర్వహించే వృత్తిదారులకు కరోనా నేపధ్యంలో సరైన ఆరోగ్య పరమైన అవగాహన కల్పించేందుకు శిక్షన తరగతులు ఏర్పాటు చేయాలని అభ్యర్ధించారు. దేవాదాయశాఖ సమన్వయంతో ఆరోగ్యశాఖ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో వృత్తిదారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేయాలని కోరారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాలకు విచ్చేసే వివిధ వర్గాల భక్తులు తీసుకోవాల్సిన చర్యలపై సేవలందించే వృత్తిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ విషయం పై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కూడా వనతిపత్రాలను అందజేయనున్నట్టు తె లిపారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం సలహాదారులు మారుతి, చంద్రశేఖర్, యాదగిరి, ఉప్పుగూడ మహంకాళి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన కేలండర్‌ను ఉమ్మడి బోనాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్ మధుసూదన్‌గౌడ్ ఆవిష్కరించారు.