ఇంక్రిమెంట్‌తోనే సరి

ABN , First Publish Date - 2020-12-06T08:17:06+05:30 IST

హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు.

ఇంక్రిమెంట్‌తోనే సరి

కలగా మిగిలిన డబుల్‌బెడ్‌రూం ఇల్లు

అమల్లోకిరాని ప్రసూతి సెలవులు.. బస్‌పాస్‌... ఇతర హామీలు

నేడు హోంగార్డుల దినోత్సవం

హైదరాబాదద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. దీంతో హోంగార్డులు తీవ్ర నిరాశలో ఉన్నారు.  తెలంగాణ పోలీ్‌సశాఖలోని ఆయా విభాగాల క్షేత్ర స్థాయిలో 15 వేల మందికిపైగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. రూ. 12 వేలుగా ఉన్న  వీరి వేతనాన్ని ఒక్క సారిగా రూ. 20 వేలకు సీఎం కేసీఆర్‌ పెంచారు. అప్పటి నుంచి  ఏటా వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్‌తో హోంగార్డుల గౌరవ వేతనం పెరుగుతూ వస్తోంది. ఇంక్రిమెంట్‌ వరకు బాగానే ఉన్నా ఇతర హామీలు అలాగే ఉండిపోయాయి.


హోంగార్డులందరికీ డబుల్‌ బెడ్‌ రూం హామీ పత్తా లేకుండా పోయింది. మహిళా హోంగార్డులకు ఆరు నెలల ప్రసూతి, పురుషులకు 15 రోజుల పెటర్నటీ సెలువులు అమలుకు నోచుకోవడం లేదు. హైదరాబాద్‌లో పనిచేసే హోంగార్డులకు బస్‌పాస్‌ అందడం లేదు. ఇవే కాదు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. బందోబస్తులు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్‌ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులు పనిచేశారు.


విధినిర్వహణలో భాగంగా కొవిడ్‌ బారినపడి చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు అందివ్వాల్సిన పరిహారంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. నేడు(ఆదివారం) 58వ హోంగార్డుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించాలని వారు ప్రభుత్వం, ఉన్నతాధికారుల్ని వేడుకొంటున్నారు.


Read more