ఆస్పత్రి నుంచే ఆఫీసు పనులు

ABN , First Publish Date - 2020-04-05T11:13:20+05:30 IST

‘‘కొత్త వైరస్‌ కావడంతో మొదటి రెండు రోజులు భయపడ్డాను. వైద్యులు ధైర్యం చెప్పారు. తర్వాత అంతా మామూలే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆన్‌లైన్‌లో వ్యాపార కార్యకలాపాలు...

ఆస్పత్రి నుంచే ఆఫీసు పనులు

  • నాన్న నుంచి అమ్మకు, నాకు కరోనా
  • మొదటి రెండు రోజులు భయపడ్డా
  • వైద్యులు చాలా బాగా చూసుకున్నారు
  • ముగ్గురికీ నయమైంది... సంతోషంగా ఉంది
  • కరోనా నుంచి కోలుకున్న ఓ యువకుడు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘‘కొత్త వైరస్‌ కావడంతో మొదటి రెండు రోజులు భయపడ్డాను. వైద్యులు ధైర్యం చెప్పారు. తర్వాత అంతా మామూలే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆన్‌లైన్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున్నాను’’ కొవిడ్‌ నుంచి కోలుకున్న ఓ యువకుడు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పిన మాటలు ఇవి. ‘‘నాన్న దుబాయ్‌ నుంచి వచ్చాక  అనారోగ్యానికి గురయ్యారు. గాంధీ ఆస్పత్రికి వెళ్తే పరీక్షలు నిర్వహించారు. మార్చి 18వ తేదీన కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలింది. మాకు పరీక్షలు నిర్వహించగా మాక్కూడా వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. దీంతో ముగ్గురినీ ఒకే చోట ఉండే విధంగా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. వైద్యులు మమ్మల్ని తమ కుటుంబసభ్యుల్లాగే చూసుకున్నారు. మంచి ఆహారం అందించారు. డ్రైఫూట్స్‌ ఇచ్చారు. మమ్ములను త్వరగా కోలుకునే విధంగా చూసుకున్నారు. ముగ్గురికీ నయమైంది’’ అని ఆ యువకుడు సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘ఆస్పత్రిలోకి ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ అనుమతించారు. దీంతో ప్రతిరోజూ బంధువులతో మాట్లాడేవాళ్లం. మేము ల్యాప్‌టా్‌పల వ్యాపారం చేస్తాం. నా వెంట ల్యాప్‌టాప్‌ ఉండటంతో ఆస్పత్రి నుంచే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాను’’ అని చెప్పుకొచ్చాడు. నాలుగైదు సార్లు నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతనే వైద్యులు తమను ఇంటికి పంపించారని తెలిపాడు. రెండు వారాలు ఆస్పత్రిలోనే ఉన్నామన్నారు. ఆస్పత్రిలో సదుపాయాలన్నీ బాగున్నాయని చెప్పాడు. తామున్న వార్డును ప్రతీరోజు శుభ్రం చేసేవారని, వార్డులో ఎప్పటికప్పుడు అవసరమైన మందులను స్ర్పే చేసేవారని చెప్పాడు.


వారం రోజులు జ్వరం: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

తనకు కరోనా సోకినప్పుడు మొదటి వారం రోజులు జ్వరంగా ఉందని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పాడు. ఇతర లక్షణాలు ఏమీ కనిపించలేదన్నాడు. ప్రాజెక్టు పని మీద ఫిబ్రవరి 9న నెదర్లాండ్స్‌కు వెళ్లానని, అక్కడ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్చి 9న ఇంటికి వచ్చానని చెప్పాడు. రెండు రోజులకు జ్వరం వచ్చిందని తెలిపాడు. ‘‘మార్చి 13న గాంధీకి వెళ్లాను అక్కడ కరోనా పరీక్ష చేశారు. అదే రాత్రి నన్ను ప్రత్యేక వార్డుకు తరలించారు. 14వ తేదీన పాజిటివ్‌గా వచ్చింది. నాకు జ్వరం ఉన్న వారంలో రెండు సార్లు పరీక్షలు చేశారు. జ్వరం తగ్గాక మరో రెండు సార్లు పరీక్షలు చేశారు. నెగిటివ్‌ రావడంతో మార్చి 31వ తేదీన డిశ్చార్జి చేశారు’’ అని అతడు చెప్పాడు.

Updated Date - 2020-04-05T11:13:20+05:30 IST