రంగు మారిన ధాన్యం పరిశీలన

ABN , First Publish Date - 2020-11-26T08:21:00+05:30 IST

రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై నాణ్యత నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నిపుణుల

రంగు మారిన ధాన్యం పరిశీలన

నాణ్యత ప్రమాణాలను పరీక్షించనున్న కమిటీ 

నివేదిక తర్వాత కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్ణయం

యాదాద్రి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై నాణ్యత నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నిపుణుల కమిటీ బృందం రైతులకు హామీ ఇచ్చింది. అధిక వర్షాలతో తడిసి రంగుమారిన ఽధాన్యం నాణ్యత పరిశీలనకు సివిల్‌ సప్లయిస్‌, వ్యవసాయ శాఖలకు చెందిన నిపుణులతో ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యుల కమిటీ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించింది. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, ఎఫ్‌సీఐ రిటైర్డ్‌ క్వాలిటీ మేనేజర్‌ మల్లారెడ్డి, సివిల్‌ సప్లయి టెక్నికల్‌ మేనేజర్‌ సైదులు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రహ్మాన్‌లతో కూడిన ఈ కమిటీ సభ్యులు జిల్లాలోని పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్‌ మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.


కేంద్రాల్లోని రంగుమారిన ధాన్యం రాశులను పరిశీలించి నమూనాలు సేకరించారు. రంగుమారిన ధాన్యం నాణ్యత ప్రమాణాలను శాస్త్రీయంగా పరీక్షించి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని మోహన్‌రెడ్డి తెలిపారు. రంగుమారిన ధాన్యంలో తేమ, మిల్లింగ్‌లో నూక శాతం ఎంత అనేది శాస్త్రీయంగా నిర్ధారించి అందజేసే నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటుందని పౌరసరఫరాల టెక్నికల్‌ మేనేజర్‌ సైదులు రైతులకు వివరించారు.

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరిస్తుండగా, అధిక వర్షాలతో పైరు నీట మునిగి, కల్లాల్లో తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. దీంతో తడిసి రంగుమారిన ధాన్యాన్ని సివిల్‌ సప్లయిస్‌ శాఖ  కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు కొన్ని రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ఽధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.


Updated Date - 2020-11-26T08:21:00+05:30 IST