కోర్టు ఆదేశాలతో..‘కొవిడ్‌’ టెస్టుల లక్ష్యాలు

ABN , First Publish Date - 2020-11-21T08:37:09+05:30 IST

కరోనా పరీక్షలు తక్కువగా చేయడంపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ 65 వేలకు తగ్గకుండా కొవిడ్‌ టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రతి జిల్లాకు చేయాల్సిన పరీక్షల టార్గెట్‌ను విధించింది. నిర్దేశించిన పరీక్షల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు

కోర్టు ఆదేశాలతో..‘కొవిడ్‌’ టెస్టుల లక్ష్యాలు

జిల్లాలవారీగా పరీక్షల టార్గెట్‌లను నిర్దేశిస్తూ  వైద్యఆరోగ్య శాఖ ఆదేశాలు

ఇకపై రోజూ 65వేలకుపైగా టెస్టులు


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షలు తక్కువగా చేయడంపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ 65 వేలకు తగ్గకుండా కొవిడ్‌ టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రతి జిల్లాకు చేయాల్సిన పరీక్షల టార్గెట్‌ను విధించింది. నిర్దేశించిన పరీక్షల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 35-40 వేల మధ్యే కొవిడ్‌-19 టెస్టులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తున్న నేపఽథ్యంలో దాన్ని ఎదుర్కొవాలంటే విస్తృత పరీక్షలొక్కటే మార్గం. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా టెస్టులు జరుగుతుండటం, హైకోర్టు కూడా పరీక్షల సంఖ్య పెంచాలని ఆదేశించడంతో ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ వాటి సంఖ్యను పెంచనుంది. 


రోజుకు 3వేల టెస్టులూ చేయడం లేదు.. 

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 1,076 కేంద్రాల్లో యాంటీజెన్‌, 18 చోట్ల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల సామర్థ్యం రోజుకు 25 వేల వరకు ఉండగా, వాటిలో ప్రస్తుతం రోజుకు కనీసం మూడు వేలు కూడా చేయడం లేదు. కాగా ఆగస్టు 20 నుంచి టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లి ఒక దశలో 60 వేలకు పైగా చేశారు. కానీ ఆ తర్వాత వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. వైర్‌సను అదుపులో పెట్టాలంటే రాష్ట్ర జనాభా ప్రకారం రోజుకు కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ స్థాయిలో పరీక్షలు చేయకపోవడం కూడా మంచి పరిణామం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో వైరస్‌ విజృంభించే అవకాశం ఉంది. ప్రజలు కూడా యథేచ్ఛగా బయటకు వస్తున్నారు.


దాంతో వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే జిల్లాల వారీగా టెస్టుల టార్గెట్‌ను వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించింది. హాట్‌స్పాట్‌ ఏరియాలున్న జిల్లాల్లో ఎక్కువగా టెస్టులు చేయబోతున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా రోజూ 11వేలు, నారాయణపేట్‌లో అత్యల్పంగా 700 టెస్టులు నిర్వహించనున్నారు. కొత్తగూడెంలో 2500, రంగారెడ్డిలో 280, మేడ్చల్‌లో 3000, వరంగల్‌లో 2750 టెస్టులు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక సిరిసిల్ల, నారాయణపేట్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లోనే రోజుకు 1000లోపు టెస్టుల టార్గెట్‌ ఉండగా, మిగిలిన అన్ని జిల్లాల్లో సగటున 1200 నుంచి 1500 పరీక్షలు చేయాలని డీహెచ్‌ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. యాంటీజెన్‌ టెస్టులకు అదనంగా 15-18 వేల వరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కూడా చేయాలని ఆదేశించారు.


టెస్టుల కోసం వచ్చే జనాలేరి ?

ఒకవైపు పరీక్షల సంఖ్య భారీగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించినప్పటికి వాటి కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గతంలో కొవిడ్‌ టెస్టుల కోసం ఎక్కడ చూసినా భారీ క్యూలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని, పరీక్షల కోసం రావాలని ఎంత విస్తృతంగా ప్రచారం చేసిన ప్రజలు రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దానికితోడు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఐసొలేషన్‌లో ఉంచుతారనే కారణంతోనూ చాలామంది పరీక్షల కోసం ముందుకురావడం లేదు. ప్రస్తుతం 310 సంచార వాహనాల ద్వారా కూడా జిల్లాల్లో పరీక్షలు చేస్తున్నారు. ప్రజల వద్దకే అవి వెళ్తోన్నా... టెస్టులు చేయించుకునేందుకు అనుకున్న స్థాయిలో అనుమానితులు రావడం లేదని అంటున్నారు. 


ప్రతి పది రోజులకు టెస్టు చేయించుకోండి 

వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సంతలు, నిత్యం పని, ఆఫీసు కార్యాకలాపాల కోసం వచ్చేవారంతా ప్రతి పది రోజులకు కచ్చితంగా కొవిడ్‌ నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం జనసంచారం బాగా పెరిగింది. ప్రధానంగా  వ్యాపార, వాణిజ్య సముదాయల్లో ఉండేవారి వద్దకు రోజూ వందలాది మంది వచ్చిపోతుంటారు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి పది రోజులకు కరోనా టెస్టులు చేయించుకోవాలి. లక్షణాలున్న వారు కూడా పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే ప్రాణాలు మీదకు వస్తుంది.   

- డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

Updated Date - 2020-11-21T08:37:09+05:30 IST