నోటిఫికేషన్ సరే.. నియామకాలేవి?
ABN , First Publish Date - 2020-12-15T08:21:20+05:30 IST
ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అంటూ నిరుద్యోగులు నిరీక్షిస్తుంటారు. ఒకసారి ప్రకటన వెలువడితే కొన్ని వారాల్లోనే నియామకాల

జాడలేని గురుకుల పీఈటీ పోస్టులు
మూడేళ్లుగా భాషా పండితుల నిరీక్షణ
1,116 ఉపాధ్యాయుల పోస్టులు పెండింగ్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అంటూ నిరుద్యోగులు నిరీక్షిస్తుంటారు. ఒకసారి ప్రకటన వెలువడితే కొన్ని వారాల్లోనే నియామకాల ప్రక్రియ పూర్తవుతుందన్న ఆశతో ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడతారు. కానీ.. రాష్ట్రంలో నియామకాల పరిస్థితి భిన్నంగా ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నియామకాలు జరుగుతాయని చెప్పలేం. నోటిఫికేషన్ ప్రకటించినా, పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తిచేసినా, ఎంపికైనవారి తుది జాబితా విడుదలచేసినా.. ఉద్యోగం ఇస్తారన్న నమ్మకం లేదు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి గత మూడున్నరేళ్లలో 1,116 ఉద్యోగాలకు ఇచ్చిన రెండు నోటిఫికేషన్లు పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది.
2017 ఏప్రిల్‌లో..
రాష్ట్రంలోని గురుకులాల్లో 616 వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక పీఈటీలకు సంబంధించిన ఇదే పెద్ద నోటిఫికేషన్. ఒకేసారి 616 పోస్టులు ప్రకటించడంతో అభ్యర్థులు వేలసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2017 సెప్టెంబరు 17, 18 తేదీల్లో అర్హత పరీక్ష జరిగింది.
2018 మేలో ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 1,232 మందిని ఎంపికచేశారు. ధ్రువపత్రాల పరిశీలనను పూర్తిచేశారు. తుది జాబితా ప్రకటించడమే తరువాయి అన్న తరుణంలో నియామకాల ప్రక్రియను పక్కనబెట్టారు. అప్పటినుంచి అభ్యర్థులు నియామకాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 2017 అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, ఎల్పీలు, సెకండరీ గ్రేడ్‌కు సంబంఽధించి 8,792 ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ వెలువడింది. 2018 ఫిబ్రవరిలో పరీక్షలు ముగిశాయి.
ఇందులో ఇతర పోస్టులను భర్తీ చేసినా.. 342 భాషా పండితుల పోస్టులు పెండింగులో ఉంచారు. 158 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 2018 జూన్‌లో ఫలితాలు ప్రకటించి.. రెండు నెలల తర్వాత 1:3 ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 148 మందిని ఎంపికచేశారు. వారికి నియామకాలు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకా పూర్తవలేదు.
కోర్టుల పేరుతో జాప్యం..
కోర్టులో వ్యాజ్యం దాఖలైతే చాలు.. నియామక ప్రక్రియను నిలిపేయడం సర్కారుకు అలవాటైపోయింది. టీఆర్టీ భాషా పండితుల విషయంలో నియామకాలు చేపట్టవచ్చంటూ కోర్టు జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రభుత్వం ఆ ప్రక్రియను ప్రారంభించలేదు.