శవాలు కుళ్లుతుంటే ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2020-08-22T08:40:54+05:30 IST

ఖమ్మం జిల్లా ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడంపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజులుగా ఫ్రీజర్లు

శవాలు కుళ్లుతుంటే ఏం చేస్తున్నారు?

  • ఖమ్మం కలెక్టర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు
  •  ‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణ


హైదరాబాద్‌/ఖమ్మం సంక్షేమవిభాగం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడంపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజులుగా ఫ్రీజర్లు పనిచేయకుంటే  ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లుకు హెచ్‌ఆర్సీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 18లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని వారిని ఆదేశించింది. ‘‘మృతదేహాలు కుళ్లిపోతున్నాయ్‌. ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో పనిచేయని ఫ్రీజర్లు’’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఆ ఆస్పత్రిలో రోజుకు 10-12 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారని గుర్తుచేసింది.  ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో కరోనా మృతదేహాలను రెండు గంటల్లోనే  మునిసిపల్‌ అధికారులకు అప్పగిస్తున్నారని పేర్కొంది. ఫ్రీజ ర్లు పనిచేయకపోవడంపై ఆ ఆస్పత్రి ఆర్‌ఎంఓ శ్రీనివాసరావును సంప్రదించగా, జిల్లాలో టెక్నికల్‌ ఉద్యోగులు లేరని, త్వరలోనే ఫ్రీజర్లు బాగుచేయిస్తామని చెప్పారని వివరించింది. 


అన్నం ఫౌండేషన్‌ అంత్యక్రియలు

ఖమ్మం జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉన్న నాలుగు అనాథశవాల్లో మూడింటికి  ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. రైల్వేశాఖ ఫిర్యాదుతో ఉంచిన మరో మృతదేహానికి శవ పంచనామా, అనాథ శవాల తరలింపు నిబంధనలు పూర్తి కాకపొవటంతో దానిని మార్చురీలోనే ఉంచారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు స్పందించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ఓ టెక్నీషియన్‌ను పిలిపించి  ఫ్రీజర్ల మరమ్మతుకు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-08-22T08:40:54+05:30 IST