ఐపీఎస్‌ వీకే సింగ్‌ రాజీనామా నోటీసు

ABN , First Publish Date - 2020-06-25T08:46:30+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, పోలీస్‌ శిక్షణా కేంద్రం డైరెక్టర్‌ వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకే సింగ్‌) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎస్‌ వీకే సింగ్‌ రాజీనామా నోటీసు

అక్టోబరు 2 నాటికి విముక్తి కల్పించండి

ప్రభుత్వానికి భారం కాదల్చుకోలేదు

కేంద్ర హోం శాఖకు వీకే సింగ్‌ లేఖ


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, పోలీస్‌ శిక్షణా కేంద్రం డైరెక్టర్‌ వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకే సింగ్‌) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 2న (గాంధీ జయంతి) స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ఆయన బుధవారం లేఖతో పాటు నోటీసు పంపారు. స్వచ్ఛంద పదవీ విరమణకు మూడు నెలల ముందే నోటీసు ఇవ్వాలనే నిబంధనలో భాగంగానే తాను లేఖ ద్వారా ఈ విషయం తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘1987 బ్యాచ్‌ ఐపీఎ్‌సగా ఎన్నో గొప్ప ఆశయాలతో పోలీస్‌ శాఖలో చేరాను. పోలీసింగ్‌లో మార్పులు తేవాలని భావించినా ఆ విషయంలో నేను విఫలమయ్యాను. నా సేవల ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాను. బహుశా రాష్ట్ర ప్రభుత్వం నా అభిప్రాయాలు అంత విలువైనవిగా పరిగణించలేకపోయి ఉండవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి నేను బరువు కాదలచుకోలేదు. ప్రభుత్వం కూడా అసమర్థుల్ని భరించాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మార్పు తేవడం ద్వారా తెలంగాణలో మార్పు కోసం పనిచేస్తా. అందుకే అక్టోబరు 2న స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని లేఖలో ఆయన వెల్లడించారు. తాను ఏ ప్రభుత్వానికీ వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకుంటే పోలీస్‌ ఉద్యోగంలో చేరాలని సూచించారు.

 

కొద్ది రోజుల క్రితం సీఎస్‌కు లేఖ

పదోన్నతి విషయంలో తనకు జరుగుతున్న అన్యాయంపై వీకే సింగ్‌ కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 1987 బ్యాచ్‌కు చెందిన తనకు అర్హత ఉన్నా ఇప్పటి వరకు డీజీపీగా పదోన్నతి ఎందుకు ఇవ్వలేదో తెలపాలని కోరారు. ఒకవేళ తాను పదోన్నతికి అర్హుడిని కాదని భావించి, ఆ విషయం చెప్తే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తానని కూడా లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-06-25T08:46:30+05:30 IST