చెప్పాపెట్టకుండా భూ సర్వే..మహిళకు గుండెపోటు

ABN , First Publish Date - 2020-12-30T07:25:39+05:30 IST

ప్రభుత్వానికి రైతుల మధ్య ఐదేళ్లుగా జరుగుతున్న ఓ భూ వివాదం, మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. సమాచారం ఇవ్వకుండా సర్వే చేస్తున్న అధికారుల తీరుతో ఆందోళనకు గురై ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లా

చెప్పాపెట్టకుండా భూ సర్వే..మహిళకు గుండెపోటు

అధికారుల ఎదుటే కుప్పకూలి మృతి


మఠంపల్లి, డిసెంబరు 29: ప్రభుత్వానికి రైతుల మధ్య ఐదేళ్లుగా జరుగుతున్న ఓ భూ వివాదం, మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. సమాచారం ఇవ్వకుండా సర్వే చేస్తున్న అధికారుల తీరుతో ఆందోళనకు గురై ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పెదవీడు రెవెన్యూ పరిధిలో 1870 ఎకరాల నిర్వాసితుల భూమిలో ఆక్రమణలు జరిగాయి. ప్రైవేట్‌ పరిశ్రమకు చెందిన వారు, పలుకుబడి ఉన్న వారు భూమి ఆక్రమించారని రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు తహసీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు సస్పెండ్‌ అయ్యారు. కలెక్టర్‌ ఆదేశాలమేరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించేందుకు మంగళవారం సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. సర్పంచ్‌ ముడావత్‌ పార్వతిని సంప్రదించగా.. రైతులు అందుబాటులో లేరని బుధవారం సర్వేకు రావాలని సూచించారు. అయినా కొందరు సిబ్బంది గ్రామంలోని కొందరి భూముల వివరాలు తెలుసుకునేందుకు ఇళ్లకు వెళ్లారు.


ధ్రువీకరణ పత్రాలు చూపించాలని మున్యా అనే రైతు ఇంటికి వెళ్లి వివరాలు అడిగారు. అక్కడే ఉన్న గ్రామానికి చెందిన రైతు నర్సింహ భార్య రమావత్‌ మోతీ(54) పత్రాలు లేకుంటే మా భూములు మాకు దక్కావా? అని ప్రశ్నించింది. హక్కు పత్రాలుంటే అర్హులైన వారికి దక్కుతాయని లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని వారు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన మోతీకి రక్తపోటు పెరిగి సర్వే చేస్తున్న ఆర్‌ఐల ఎదుటే కుప్పకూలింది. ఆమెను హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేయడంతోనే మోతీ ఒత్తిడికి లోనై మృతిచెందిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-12-30T07:25:39+05:30 IST