కోత కాదు.. వాయిదా

ABN , First Publish Date - 2020-04-01T08:39:18+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై సర్కారు స్పష్టతనిచ్చింది. ఉద్యోగులకు ఏప్రిల్‌లో చెల్లించే జీతాల్లో కోత కాకుండా.. కొంత భాగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కోత కాదు.. వాయిదా

ఉద్యోగుల జీతాలపై ఉత్తర్వుల్లో స్పష్టత...

ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించనిదే కుదరని కోత

అందుకే.. జీతం వాయిదా అన్న సర్కారు

మిగతా సగం ఎప్పుడిస్తారో చెప్పని వైనం

మినహాయింపుల్లేకుండా అందరికీ వర్తింపు


హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై సర్కారు స్పష్టతనిచ్చింది. ఉద్యోగులకు ఏప్రిల్‌లో చెల్లించే జీతాల్లో కోత కాకుండా.. కొంత భాగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు.. జీతాలను తగ్గించి ఇవ్వాలన్న నిర్ణయాన్ని.. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందితో సహా మినహాయింపుల్లేకుండా అందరికీ వర్తింపజేయనున్నట్టు అందులో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం నాడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక మెమోను జారీ చేశారు. కరోనా కారణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులతో పాటు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అర్ధరాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం కోత పదానికి బదులుగా వాయిదా అని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నంబరు 27 పేరిట ఉత్తర్వును జారీ చేశారు.


దాంతో ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం లేదన్న భావనను ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ వాయిదా వేసిన జీతాన్ని తిరిగి ఎప్పడు, ఏలా చెల్లిస్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించకుండా ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి చట్టప్రకారం అవకాశం లేనందునే.. ఉత్తర్వులో వాయిదా అన్న అర్థం వచ్చే విధంగా పదాన్ని చేర్చినట్టు సమాచారం. ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌-1897 (సెక్షన్‌-2) ప్రకారం ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం.. అఖిలభారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, నాలుగోతరగతి, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10% , రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాలుగో తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం వేతనాల చెల్లింపును వాయిదా వేశారు.


ఆయా ఉద్యోగులకు వచ్చే జీతాల్లో ఈ శాతం ప్రకారం జీతాలు పోను మిగిలిన మొత్తాన్ని చెల్లించనున్నారు. వాయిదా వేసిన జీతాన్ని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదు. పైగా, ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులు మార్చి మాసానికి సంబంధించి ఏప్రిల్‌-1న చెల్లించే జీతాలకు వర్తిస్తుందని పేర్కొంటూనే.. మరో ఉత్తర్వు జారీ చేసే వరకు ప్రస్తుత జీవో అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏప్రిల్‌లో దీనిపై మరో ఉత్తర్వు జారీ కాకపోతే మే నెలలో చెల్లించే జీతాలకు సంబంధించి కూడా ప్రస్తుత జీవోనే వర్తిస్తుందని అర్థం. కాగా, ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వు పట్ల ఉద్యోగ సంఘాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీతాల్లో కోత విధించేఅధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే అభిప్రాయాన్ని సంఘం నేతలు వ్యక్తం చేస్తున్నారు.


జీతాల చెల్లింపుపై మార్గదర్శకాలు

ప్రభుత్వం జారీ చేసిన జీవో-27 ప్రకారం ఆయా వర్గాల ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌, పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఇతర అన్ని రకాల చెల్లింపు అధికారులకు మెమో జారీ చేశారు. దీని ప్రకారం ఉద్యోగికి సంబంధించి మొత్తం జీతం అంటే.. గ్రాస్‌ శాలరీతో పాటు, వివిధ అలవెన్సులు, ఇతర చెల్లింపులను పరిగణలోకి తీసుకుంటారు. జీవోలో నిర్ణయించిన శాతం పోను మిగిలిన జీతాన్ని చెల్లించనున్నారు. ఎమ్మెల్యేల జీతం తక్కువగా ఉంటుంది. ఇతర అలవెన్సులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీతం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని కలిపి జీతం యూనిట్‌గా పరిగణలోకి తీసుకుని, అందులో 75% పోను మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే ప్రభుత్వంలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేసే కొందరు, వివిధ ప్రైవేట్‌ సంస్థల పరిధిలో ఉంటారు. ఆయా ఏజెన్సీల ద్వారానే వారికి జీతాలు అందుతాయి.

Updated Date - 2020-04-01T08:39:18+05:30 IST