ఆగని ‘సోషల్‌’ ప్రచారం..

ABN , First Publish Date - 2020-12-01T08:10:23+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసినా.. సోషల్‌ మీడియాలో మాత్రం సోమవారం జోరుగా ప్రచారం సాగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు హోరాహోరీగా పోస్టింగ్‌లు చేశారు. నియమావళి ప్రకారం.. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదు

ఆగని ‘సోషల్‌’ ప్రచారం..

హోరాహోరీగా పోస్టింగ్‌లు..పార్టీలదీ అదే తీరు

తమ అభ్యర్థులకే ఓటెయ్యాలని ట్వీట్లు 

ఎన్నికల నిబంధనలు బేఖాతరు


హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసినా.. సోషల్‌ మీడియాలో మాత్రం సోమవారం జోరుగా ప్రచారం సాగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు హోరాహోరీగా పోస్టింగ్‌లు చేశారు. నియమావళి ప్రకారం.. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ నిబంధన సోషల్‌ మీడియాకూ వర్తిస్తుంది. కానీ    సోమవారం సైతం వందల పోస్టింగ్‌లు దర్శనమిచ్చాయి. ఒక్క కార్యకర్తలే కాదు.. పార్టీల అధికారిక ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల్లోనూ ప్రచార చిత్రాలు కనిపించాయి. ‘‘సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేసింది. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కారు గుర్తుకు ఓటేయండి’’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ  ట్విటర్‌, ఫేక్‌బుక్‌ ఖాతాల్లో పోస్టింగ్‌ పెట్టారు. హైదరాబాద్‌లో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న కారు అంటూ మరో వీడియోను రూపొందించి వైరల్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌ ఖాతాల్లోని వాటిని మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేయడం గమనార్హం.


ప్రచార సమయంలో రోజూ పదుల సంఖ్యలో ట్వీట్లు చేసిన ఆయన.. ఎన్నికల నియమావళి నేపథ్యంలో పోస్టింగ్‌లు చేయలేదు. తమ పార్టీ అధికారిక ట్విటర్‌ ఖాతాలోని పోస్టులతో పాటు ఒక జాతీయ టీవీ చానల్‌లో ప్రసారమైన తన ఇంటర్వ్యూను మాత్రమే రీట్వీట్‌ చేశారు. ‘‘తెలంగాణలోని కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ సోమవారం హైదరాబాద్‌కు రండి. ఇక్కడున్న మీ బంధువులు, స్నేహితులను కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పండి’’ అని    టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఒక ట్వీట్‌ చేశారు. దానిని తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ ఖాతా రీట్వీట్‌ చేసింది. ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్‌ ఖాన్‌ ఎన్నికల ప్రచారంలో తీసిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.


ఆ ట్వీట్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ రీట్వీట్‌ చేసింది. తెలంగాణ బీజేపీ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల్లోనూ ప్రచార పోస్టింగ్‌లు కనిపించాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందేశం వీడియోను బీజేపీ ట్విటర్‌ ఖాతాలో  పోస్ట్‌ చేశారు.   ‘ఓట్‌ ఫర్‌ బీజేపీ’ అని పేర్కొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాత్రం ప్రచారానికి సంబంధించిన ఎలాంటి పోస్టింగ్‌లు  పెట్టలేదు. ఎంఐఎం అధికారిక ట్విటర్‌ ఖాతాలో అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ప్రసంగాలను పోస్ట్‌ చేశారు. వాటిని వారిద్దరూ రీట్వీట్లు చేశారు.

Updated Date - 2020-12-01T08:10:23+05:30 IST