పంపిణీకి బియ్యం లేవు

ABN , First Publish Date - 2020-12-03T06:52:04+05:30 IST

పౌరసరఫరాల శాఖ వద్ద బియ్యం నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం 50 వేల టన్నుల నిల్వలే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రైస్‌

పంపిణీకి బియ్యం లేవు

ఈ నెల కోటాకు 2 లక్షల టన్నులు అవసరం.. ఉన్నవి 50 వేల టన్నులే 

మిల్లర్ల వద్ద 13.35 లక్షల టన్నులు బ్యాలెన్స్‌.. వాటిని అప్పగించడంలో జాప్యం

ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం.. నత్తనడకన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సిస్టమ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ వద్ద బియ్యం నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం 50 వేల టన్నుల నిల్వలే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లు బియ్యాన్ని అప్పగించడంలో జాప్యం చేస్తుండడం పౌర సరఫరాలశాఖకు తలనొప్పిగా మారుతోంది. పీడీఎ్‌సపై తీవ్ర ప్రభావం పడుతోంది.రాష్ట్రంలో 87.55 లక్షల ఆహారభద్రత కార్డులపై 2.97 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. డిసెంబరు నెల కోటాకు పీడీఎస్‌ ద్వారా 2 లక్షల టన్నుల బియ్యం కావాలి. పంపిణీ చేయాలంటే ఇంకా 1.50 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతాయి.


రైస్‌ మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ కింద బకాయి ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తేనే డిసెంబర్‌ నెల పీడీఎస్‌ కోటా గట్టెక్కుతుంది. మిల్లర్లకు అప్పగించిన వరి ధాన్యం... 67 శాతం లెక్క చొప్పున బియ్యం రూపంలో తిరిగి రావాల్సి ఉంటుంది. మిల్లర్లు సొంత వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఈ బియ్యం సకాలంలో రావట్లేదు. దీంతో పేద ప్రజలకు పంపిణీ చేయటానికి పౌరసరఫరాలశాఖ వద్ద బియ్యం నిల్వలు సమృద్ధిగా లేకపోవడం ఆందోళనకరంగా మారింది.

పౌరసరఫరాల సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీగా పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసే వరి ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లతో మిల్లింగ్‌ చేయిస్తుంటుంది. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే వచ్చే ఉప ఉత్పత్తులకు తోడుగా మిల్లింగ్‌ చార్జీలను కూడా ప్రభుత్వం ఇస్తుంది.




తొలుత పౌరసరఫరాలశాఖ అవసరాలకు, ఆ తర్వాత ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అవసరాలకు కేంద్ర ప్రభుత్వ కోటా కేటాయింపులకు అనుగుణంగా బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. రైస్‌మిల్లర్లు రైతుల నుంచి, వ్యాపారులనుంచి నేరుగా కొనుగోలుచేసిన వరి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, లాభసాటి ధరకు బియ్యం అమ్ముకునే పనిలోనే నిమగ్నమయ్యారు. దీంతో కస్టమ్‌ మిల్లింగ్‌ సిస్టమ్‌ నత్తనడకన సాగుతోంది.


ఇప్పటివరకు 5,813 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 21.39 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు అప్పగించారు. 14.33 లక్షల టన్నుల బియ్యం రైస్‌ మిల్లర్ల నుంచి తిరిగి ప్రభుత్వానికి రావాలి. ఇంతవరకు కేవలం 98 వేల క్వింటాళ్ల బియ్యం మాత్రమే తిరిగొచ్చాయి. ఏరోజుకారోజు మిల్లులకు చేరిన వరి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయలేక పోయినా, చైన్‌ సిస్టమ్‌లో కాస్త ఆలస్యం జరిగినా... కనీసం 50 శాతం బియ్యాన్నయినా తిరిగి ఇవ్వాలి. కానీ ఇంతవరకు 6.81 శాతం మాత్రమే బియ్యాన్ని తిరిగిచ్చారు. ఇదేక్రమంలో గడిచిన రబీ సీజన్‌కు సంబంధించిన బియ్యం బకాయిలు కూడా 25 లక్షల మెట్రిక్‌ టన్నులు రైస్‌ మిల్లర్ల వద్దే ఉన్నాయి.  


రైస్‌మిల్లర్లదే ఆధిపత్యం

రాష్ట్ర వ్యాప్తంగా 2,500 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో 1,600 రా రైస్‌ మిల్లులు, 900 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఇప్పటికే రబీ సీజన్‌ కింద బాకీ ఉన్న బియ్యం (25 లక్షల టన్నులు) మొత్తం బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన బాకీ బియ్యం(13.35 లక్షల టన్నులు) అంతా ‘రా రైస్‌ మిల్లర్ల’ వద్ద ఉన్నాయి.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టగానే ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేస్తారు. రైస్‌మిల్లర్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వగానే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అప్పుడే రైతులకు పేమెంట్‌ వెళ్తుంది. రైస్‌మిల్లర్లు క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. తర్వాత ధాన్యం మిల్లింగ్‌కు వెళ్తుంది. రైస్‌మిల్లర్ల ఆధిపత్యం, జాప్యం పేద ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది. 


Updated Date - 2020-12-03T06:52:04+05:30 IST