ఇక నేర చరితుల ప్రక్షాళనే!

ABN , First Publish Date - 2020-09-12T08:13:50+05:30 IST

క్రిమినల్‌ కేసులతో పాటు మనీ లాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టం మొదలైన ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న

ఇక నేర చరితుల ప్రక్షాళనే!

సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులకు గండం

ఎన్నికల నుంచి శాశ్వతంగా తప్పుకొనే పరిస్థితి

సుప్రీం కోర్టు విచారణతో కదులుతున్న డొంక

తెలంగాణలో ప్రత్యేక కోర్టుకు సహాయ నిరాకరణ

పోలీసులు నిందితులను హాజరు పరచరు

50 పోలీస్‌ స్టేషన్లపై డీజీపీకి జడ్జి ఫిర్యాదు 

సీఎం సహా 77 మందిపై క్రిమినల్‌ కేసులు

ప్రత్యేక కోర్టులోని కేసుల్లో రాజాసింగ్‌ టాప్‌

మొత్తం క్రిమినల్‌ కేసుల్లో సోయం బాపూరావు

సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులకు గండం..

సుప్రీం విచారణతో కదులుతున్న డొంక


రాష్ట్రంలో ప్రత్యేక కోర్టుకు సహాయ నిరాకరణ

50 పోలీస్‌ స్టేషన్లపై డీజీపీకి జడ్జి ఫిర్యాదు 

ముఖ్యమంత్రి సహా 77 మందిపై కేసులు

ప్రత్యేక కోర్టు కేసుల్లో రాజాసింగ్‌ టాప్‌


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): క్రిమినల్‌ కేసులతో పాటు మనీ లాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టం మొదలైన ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని పెండింగ్‌ కేసుల వివరాలు తమకు రెండు రోజుల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ బెంచ్‌ గురువారం అన్ని హైకోర్టులను ఆదేశించడం రాజకీయాల్లో నేర చరితుల ప్రక్షాళనలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.


రాజకీయాల్లో నేర చరితులకు సంబంధించి పిటిషన్‌ పరిఽధిని విస్తరించి, ఈ బెంచ్‌ వివిధ  ప్రత్యేక చట్టాల కింద నిందితులైన ప్రజాప్రతినిధుల జాబితాను చేర్చాలనడం తీగలాగితే డొంక కదలినట్లయిందని వారు భావిస్తున్నారు. దీనితో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చట్టం ఉచ్చులో చిక్కుకుంటారని అంటున్నారు. 


రాజకీయ నాయకులపై విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2014 మార్చిలో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లోధా ఇచ్చిన తీర్పు అమలు కాకపోవడం, 2016లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినప్పటికీ విచారణలు ఆలస్యం కావడం కారణంగానే సుప్రీంకోర్టు రంగంలోకి దిగిందని భావిస్తున్నారు. గురువారం జస్టిస్‌ రమణ జారీ చేసిన ఆదేశాల్లో శిక్షపడ్డ నేరచరితులైన ప్రజాప్రతినిధులను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని 2016లో దాఖలైన పిటిషన్‌నూ పరిగణనలోకి తీసుకోవడం కీలకమైనదని వారు అంటున్నారు.


ఇక ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టును నియమించి ప్రజా ప్రతినిధుల కేసులను నిర్ణీతకాలంలో హైకోర్టుల పర్యవేక్షణలో తేల్చేయాలని అమికస్‌ క్యూరీ ఇచ్చిన సూచనలను కూడా తమ ఉత్తర్వుల్లో  చేర్చడంతో రాజకీయాల్లో నేరచరితుల ప్రక్షాళనలో కోర్టు సీరియస్‌గా ఉన్నదని స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలు రాజకీయ పార్టీలు ప్రచురించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు రెండుసార్లు జారీ చేసిన ఆదేశాల దరిమిలా తాజాగా ఎన్నికల కమిషన్‌ కూడా మార్గదర్శక సూత్రాలు జారీ చేయాల్సి రావడం గమనార్హం. 




తెలంగాణలో 118 కేసులు


తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదయిన క్రిమినల్‌ కేసుల సత్వర పరిష్కారానికి ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానంలో 118 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని 2007లో నమోదైన కేసులుండటం గమనార్హం. సీఎం కేసీఆర్‌పైనా నాలుగు క్రిమినల్‌ కేసులు(ఉద్యమానికి సంబంధించినవి) పెండింగ్‌లో ఉండగా.. అందులో మూడు వరంగల్‌లో, ఒకటి వరంగల్‌లో నమోదయ్యాయి.


మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌పై రెండు, కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌లపై తలో కేసు పెండింగ్‌లో ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అత్యధికంగా 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 7కేసులతో రేవంత్‌రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. 6 కేసులతో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మూడో స్థానంలో ఉన్నారు. 5 కేసులతో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 4 కేసులతో మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌పై రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2018 ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది. కోర్టు ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత జడ్జిని నియమించారు. ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు చేయలేదు.


ఎంపీ, ఎమ్మెల్యేలపై సుమారు 500 కేసులు ఉండగా, కొన్ని మాత్రమే ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి. తమ పీఎస్‌ల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు ఎస్‌హెచ్‌వోలు భయపడుతున్నారు. ఈ విషయమై 50 మంది ఎస్‌హెచ్‌వోలపై ఫిర్యాదు చేస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్వయంగా డీజీపీకి లేఖ రాయాల్సి వచ్చింది.


రాష్ట్రంలో 77 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులున్నాయి. 10 మంది ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై అత్యధికంగా 52 కేసులు, ఎంపీ రేవంత్‌రెడ్డిపై 42 కేసులున్నాయి.




ప్రత్యేక కోర్టు  సరిగా పని  చేయడం లేదు


నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు ఆశించినంతగా పని చేయడం లేదు. నిందితులు, సాక్షులను పోలీసులు కోర్టులో హాజరుపరచడం లేదు. కొన్నేళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఖమ్మం ఎంపీపైనా తీవ్ర కేసులున్నాయి. ఒక మంత్రిపై సీబీఐ కేసులు, బోధన్‌ ఎమ్మెల్యేపై పాస్‌పోర్టు కేసు, మరికొందరిపై మానవ అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులకు పరిష్కారం లభించనుంది.

- పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌


Updated Date - 2020-09-12T08:13:50+05:30 IST