పరీక్షలు పెట్టరు.. ప్రమోట్‌ చేయరు!

ABN , First Publish Date - 2020-09-05T09:30:05+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓరియంటల్‌ కాలేజీలో ప్రీ డిగ్రీ కోర్సు (పీడీసీ) చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ప్రభుత్వం గానీ, ఇటు వర్సిటీ గానీ పట్టించుకోవడం

పరీక్షలు పెట్టరు.. ప్రమోట్‌ చేయరు!

  • విద్యా సంవత్సరం కోల్పోతున్న ఓరియంటల్‌  విద్యార్థులు
  • పట్టించుకోని ఉస్మానియా వర్సిటీ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓరియంటల్‌ కాలేజీలో ప్రీ డిగ్రీ కోర్సు (పీడీసీ) చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ప్రభుత్వం గానీ, ఇటు వర్సిటీ గానీ పట్టించుకోవడం లేదు. రెండేళ్ల పాటు ప్రీ డిగ్రీ కోర్సు చదివిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడమా..? లేకుంటే కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రమోట్‌ చేయడమా..? అన్న ప్రశ్నలపై ఇప్పటి వరకూ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఆరు కాలేజీల్లో చదువుతున్న సుమారు 300 మంది విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దోస్త్‌ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవడంతో  దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు అర్హత లేకుండా పోయింది. త్వరగా సరైన నిర్ణయం తీసుకోకపోతే విద్యా సంవత్సరాన్ని నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఆరు ఓరియంటల్‌ కాలేజీలున్నాయి. వీటిల్లో వివిధ భాషల్లో ప్రీ  డిగ్రీ కోర్సులను ఇంటర్మీడియట్‌కు సమానంగా అందిస్తున్నాయి. ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులైన తరవాత  ఇంటర్‌ విద్యార్థుల మాదిరిగానే ‘దోస్‌’్త ద్వారా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.


ప్రీ డిగ్రీ కోర్సు చదివిన విద్యార్థులకు నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్‌ కాలేజీలోనే సీట్లున్నాయి. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దోస్త్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌ లేదా, ప్రీ  డిగ్రీ కోర్సు ద్వితీయ సంవత్సరం సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఓరియంటల్‌ కాలేజీల్లో ప్రీ డిగ్రీ  విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ఎలాంటి సర్టిఫికెట్‌నూ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదముంది. ఇప్పటికే ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు ఉస్మానియా రిజిస్ర్టార్‌కు లేఖ రాసినా ఫలితం లేదు. 7వ తేదీలోపు దోస్త్‌ మొదటి ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ముగుస్తుంది. ఆలోపు రెండో సంవత్సరం ఉత్తీర్ణులను ప్రకటిస్తే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, లేదంటే విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు

Updated Date - 2020-09-05T09:30:05+05:30 IST