హైదరాబాద్‌: ఆ పార్కులోకి ఇక నో ఎంట్రీ.. మహిళా సంఘాల ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-03-02T12:43:17+05:30 IST

నెల రోజుల నుంచి ముగ్గురు వ్యక్తులు..

హైదరాబాద్‌: ఆ పార్కులోకి ఇక నో ఎంట్రీ.. మహిళా సంఘాల ఫిర్యాదు

  • ముగ్గురి వద్దే తాళం చెవ్వులు
  • జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్/అడ్డగుట్ట : ఈ మున్సిపల్‌ పార్కులో బయటి వ్యక్తులకు నో ఎంట్రీ. స్థానికంగా ముగ్గురి వద్దే తాళాలు ఉంటాయి. మహిళా గ్రూపు మీటింగ్‌లకు తాళం చెవ్వులు ఇవ్వమని తెగేసి చెప్పిన ఆ ముగ్గురూ ఎవరనేది స్థానికులకే తెలుసంటున్నారు. సికింద్రాబాద్‌ అడ్డగుట్ట డివిజన్‌లోని సాయినగర్‌ ప్రాంతంలో ఉన్న మున్సిపల్‌ పార్కు ఐదేళ్ల క్రితం ఎండిపోయిన చెట్లు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారింది. ఏడాది నుంచి పార్కుకు మున్సిపల్‌ సిబ్బంది కొత్తరూపు తీసుకొచ్చారు. నెల రోజుల నుంచి ముగ్గురు వ్యక్తులు పార్కు తాళం దగ్గరే పెట్టుకొని ఎవరికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ పార్కును ఆ ముగ్గురు తప్ప మరెవ్వరూ వినియోగంచుకోవద్దని వారు హుకుం జారీ చేశారు. దీంతో స్థానికులు వాకింగ్‌కు ఇబ్బందులు పడుతున్నారు.


వృద్ధులు వాకింగ్‌కు దూర ప్రాంతానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతే గాకుండా అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన మహిళా గ్రూపులు వారంలో రెండు మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు ఈ పార్కు సౌకర్యంగా ఉండేది.  పార్కులో మీటింగ్‌ పెట్టుకుంటామని పొదుపు గ్రూపు మహిళలు అడుగడానికి వెళితే తాళం ఇచ్చేది లేదని కేవలం మా కోసమే పార్కు అని బెదిరిస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


తాళం ఇప్పించండి మహాప్రభో...

పార్కులో సమావేశాలు పెట్టుకుంటామని, తాళం ఇప్పించాలని పొదుపు గ్రూపు మహిళా సంఘాలు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అడ్డగుట్ట డివిజన్‌లో సరైన సౌకర్యాలు ఉన్న గదులు లేక కమ్యూనిటీహాళ్లు లేక ఇబ్బందులుపడుతున్నాం. గత్యంతరం లేక పార్కులో సమావేశాలు పెట్టుకుందామనుకుంటే తాళం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా పార్కు తాళం ఇప్పిస్తే వృద్ధులు, మహిళలు, స్థానికులు వాకింగ్‌ కోసం ఉపయోగించుకుంటారు. పొదుపు గ్రూపు మహిళలు సమావేశాలు జరుపుకోవచ్చని బస్తీ మహిళలు చెబుతున్నారు.

Updated Date - 2020-03-02T12:43:17+05:30 IST