సీతారాముల కల్యాణము చూడగ రాకండి!

ABN , First Publish Date - 2020-03-18T08:52:45+05:30 IST

కరోనా ప్రభావం రాములోరి పెళ్లిపైనా పడింది! ఏప్రిల్‌ 2న శ్రీరామ నవమి నాడు భద్రాద్రిలో సీతారాముల కల్యాణం ఈ ఏడాది ఆలయ అర్చకుల ఆధ్వర్యంలోనే జరుగుతుందని....

సీతారాముల కల్యాణము చూడగ రాకండి!

  • భక్తులు లేకుండానే భద్రాద్రి రామయ్య పెళ్లి...
  • ఆలయ చరిత్రలో తొలిసారి

ఖమ్మం/హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం రాములోరి పెళ్లిపైనా పడింది! ఏప్రిల్‌ 2న శ్రీరామ నవమి నాడు భద్రాద్రిలో సీతారాముల కల్యాణం ఈ ఏడాది ఆలయ అర్చకుల ఆధ్వర్యంలోనే జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే.. వేలాదిమంది భక్తులు వచ్చే భద్రాద్రి రామయ్య కల్యాణంపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని, కల్యాణ వేడుకకు ఎవరూ రావొద్దని సూచించారు. నవమి ఏర్పాట్లను కూడా నిలిపివేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఐపీలు ఎవరూ హాజరవడం లేదని ఆయన వెల్లడించారు.


ఆన్‌లైన్‌లో కల్యాణం టికెట్ల విక్రయాలను నిలిపివేశామని, ఇప్పటికే టికెట్లు కొన్న భక్తులకు సొమ్ములు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులతో చర్చించిన అనంతరమే దేవాదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సంప్రదాయబద్ధంగా అర్చకులే కల్యాణ తంతు నిర్వహిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలను ఆ శాఖ అధికారితో పంపే యోచనలో ఉన్నట్లు వివరించారు. సుమారు 350 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాద్రి రామాలయంలో ఇలా భక్తులు లేకుండా స్వామివారి కల్యాణం జరపనుండడం ఇదే తొలిసారి. 


విదేశీ ప్రయాణికులు ఆలయాలకు వెళ్లొద్దు: ఇంద్రకరణ్‌ 

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు రాష్ట్రంలోని దేవాలయాల్లో దర్శనానికి వెళ్లొద్దని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. గత 28 రోజుల్లో విదేశాల నుంచి వచ్చినవారు అసలే రావొద్దని, ఆ ప్రయాణికుల కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఆయన మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చే భక్తులు ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలన్నారు. ఆలయాలన్నింటినీ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.


కరోనా వైర్‌సపై భక్తులకు అవగాహన కల్పించేందుకు దేవాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, మైక్‌ల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్‌ అనిల్‌కుమార్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. యాంటీ బ్యాక్టీరియా ద్రావణాన్ని ఆలయాల లోపల, బయట పిచికారీ చేయాలని, భక్తుల వసతి గృహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పేర్కొన్నారు. క్యూలైన్లతో పాటు ఆలయాల్లో దారి పొడవునా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని, ఫాగింగ్‌ చేయాలని, సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలని సూచించారు. కరోనా బాధిత దేశాల నుంచి వచ్చిన వారు ఆలయాల్లోకి రావొద్దంటూ మైకుల్లో చెప్పాలని వివరించారు.

Updated Date - 2020-03-18T08:52:45+05:30 IST