జాతరలు, వేడుకలు వద్దు

ABN , First Publish Date - 2020-03-18T09:29:47+05:30 IST

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. నెలాఖరు వరకు ఫంక్షన్‌ హాళ్లు, జాతరలు నిర్వహించకుండా చూడాలని, గ్రామ సభలు...

జాతరలు, వేడుకలు వద్దు

  • పంచాయతీరాజ్‌ శాఖ ‘కరోనా’ చర్యలు

హైదరాబాద్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. నెలాఖరు వరకు ఫంక్షన్‌ హాళ్లు, జాతరలు నిర్వహించకుండా చూడాలని, గ్రామ సభలు నిలిపివేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది. ఇవి అమలయ్యేలా చూడాలని అధికారులు, సిబ్బందికి సూచించింది. ఆ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు నెలాఖరు వరకు మూసి వేయాలి. ఫంక్షన్‌ హాళ్లు, స్థానిక జాతరలు నిర్వహించరాదు. గ్రామ సభలు జరపకూడదు. సినిమా హాళ్లు, పార్కులు మూసి వేయించాలి.


పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి కరోనాపై అవగాహన కల్పించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై స్థానిక చానల్‌ ద్వారా చైతన్యం చేయాలి. తినుబండారాల దుకాణాల వద్ద శానిటైజర్‌లు ఉండేలా చూడాలి. బ్లీచింగ్‌ నిల్వలు ఉండేలా చూడాలి. పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. గ్రామానికి కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను(విదేశాల నుంచి) పంచాయతీ కార్యదర్శి ద్వారా సేకరించి, వారికి వైద్య పరీక్షలు జరిపేలా చూడాలి. వ్యాధి లక్షణాలు ఉంటే సంబంధిత అధికారులు, వైద్యాధికారులకు తెలియపర్చాలి. వారంతపు సంతలు నిర్వహించే చోట ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. 

బస్సు, రైల్వే స్టేషన్లు, జన సమూహం ఉండే ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనరకు ఆదేశాలు వెళ్లాయి. బఫర్‌ జోన్లను ఏర్పాటు చేసి నోడల్‌ అధికారిని నియమించాలని, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం(ఆర్‌ఆర్‌టీ)లను నియమించాలని, ఇందులో పారిశుధ్య సిబ్బంది కూడా ఉండాలని ఆదేశించారు. పాజిటివ్‌ కేసు ఉన్నట్లుగా గుర్తిస్తే ఆ ప్రాంతం నుంచి చుట్టూ 7 కిలోమీటర్ల వరకు వ్యాధి విస్తరించకుండా చూడలంటూ తదితర జాగ్రత్తలు సూచించారు.

Updated Date - 2020-03-18T09:29:47+05:30 IST