90% ఓట్లతో కవిత ఘనవిజయం

ABN , First Publish Date - 2020-10-13T09:34:16+05:30 IST

ఊహించిందే జరిగింది. వార్‌ వన్‌ సైడ్‌ అయింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు.

90% ఓట్లతో కవిత ఘనవిజయం

’నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు

బీజేపీ అభ్యర్థిపై 672 ఓట్ల భారీ మెజారిటీ

కాంగ్రెస్‌, బీజేపీలకు దక్కని డిపాజిట్‌

కౌంటింగ్‌ కేంద్రానికి రాని అభ్యర్థులు 

జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సంబురాలు 

ఆనందంతో చిందేసిన మంత్రి ప్రశాంత్‌

గెలిపించినందుకు ధన్యవాదాలు: కవిత

కేసీఆర్‌, కేటీఆర్‌, సంతోష్‌ శుభాకాంక్షలు

తండ్రి ఆశీర్వాదం తీసుకున్న తనయ

మండలిలో టీఆర్‌ఎస్‌కు మరో స్థానం

రేపే ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

కేబినెట్‌ హోదాలో పదవికి చాన్స్‌?


నిజామాబాద్‌/హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఊహించిందే జరిగింది. వార్‌ వన్‌ సైడ్‌ అయింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణపై 672 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం ఓట్లలో 90 శాతానికి పైగా ఓట్లు కవితకే పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్‌ రెండు గంటల్లో ముగిసింది. పోలైన 823 ఓట్లలో 10 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 728 ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కవితకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డేపల్లి సుభాశ్‌రెడ్డికి 29 ఓట్లు వచ్చా యి. కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రానికి ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ రాలేదు.   కవిత మాత్రం ఫలితాలు ప్రకటించాక.. 12:35 గంటలకు కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆమెకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆ వెంటనే ఆమె నేరుగా నిజామాబాద్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. కాగా, ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఓటర్లు పలువురు, ఎంఐఎం, స్వతంత్రులు కూడా కవితకే మద్దతు పలికారు. కాంగ్రెస్‌ పూర్తిగా చేతులెత్తేయగా.. బీజేపీ మాత్రం తమ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఎంపీ అర్వింద్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ వారిని క్యాంపునకు తరలించారు. దీంతో బీజేపీకి మొత్తం 78 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. 56 ఓట్లు పడ్డాయి. 


డ్యాన్స్‌ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

కవిత భారీ మెజారిటీతో గెలవడంతో జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల టపాసులు పేల్చారు. మరోవైపు.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సురే్‌షరెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు నిజామాబాద్‌కు తరలివచ్చారు. కవిత నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి డ్యాన్స్‌ చేశారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితకు.. ఎమ్మెల్సీ రూపంలో తిరిగి 16 నెలల తర్వాత మరో పదవి దక్కినట్లయింది. కాగా, తనను ఎమ్మెల్సీగా గెలిపించినందుకు సీఎం కేసీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. విజయం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిజిల్లా పరిధిలో ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి కల్పించారని అన్నారు. అందుబాటులో ఉండి అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.   


రేపు ప్రమాణ స్వీకారం !

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా బుధవారం పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆ ఒక్కరోజు శాసన మండలి సమావేశం జరగనుండటంతో సభలోనే చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమెతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించనున్నారు. కాగా, ఉప ఎన్నికలో గెలిచినట్లు నిజామాబాద్‌లో ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం కవిత ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత కవిత అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డిని కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌.. కవిత గెలుపుకోసం కృషి చేసిన వారందరినీ అభినందించారు. కవిత గెలుపు పట్ల రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక కవిత గెలుపుతో శాసనమండలిలో టీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్య 32కి చేరింది. స్థానిక సంస్థల కోటాలోని 14 ఎమ్మెల్సీ స్థానాలూ అధికార పార్టీ ఖాతాలోకే చేరినట్లయింది. 


కవితకు రాష్ట్ర స్థాయి పదవిపై చర్చ!

ఎమ్మెల్సీగా ఎంపికైన కవితకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఆమెకు సీఎం కేసీఆర్‌ తగిన ప్రాధాన్యం ఇస్తారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రొటోకాల్‌కు ఇబ్బంది లేకుండా ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే విధంగా ఆమెకు కేబినెట్‌ ర్యాంకు పదవి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-10-13T09:34:16+05:30 IST