గమ్యం చేరని ప్రయాణం

ABN , First Publish Date - 2020-05-17T08:23:35+05:30 IST

సొంత రాష్ట్రాలకు తరలివెళుతున్న వలస కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పరిధిలోని నాకాతండా వద్ద 44వ నంబర్‌ జాతీయ...

గమ్యం చేరని ప్రయాణం

నిజామాబాద్‌లో ఆగివున్న వాహనాన్ని ఢీకొన్న కారు

కారులోని భార్యాభర్తలు, కుమారుడు మృతి.. 

మృతుల స్వస్థలం కేరళ.. యూపీ నుంచి వెళుతుండగా ప్రమాదం


డిచ్‌పల్లి/ నిర్మల్‌ రూరల్‌/ నల్లగొండ/ తాండూరు రూరల్‌, మే 16: సొంత రాష్ట్రాలకు తరలివెళుతున్న వలస కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పరిధిలోని నాకాతండా వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. రోడ్డుపై ఆగివున్న టిప్పర్‌ను వెనక నుంచి స్కార్పియో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ఐదుగురిలో భార్యభర్తలు, వారి కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుమార్తెకు గాయాలయ్యాయి. బిహార్‌లో నావడ ప్రాంతంలో స్కూలు నడుపుతున్న కేరళలోని కోజికోడ్‌కు చెందిన భార్యభర్తలు అనిశ్‌ థామస్‌(32), జాలిన్‌ థామస్‌(21), వారి పిల్లలు అనాలియ థామస్‌(2), దివ్య.. స్కార్పియోలో స్వరాష్ట్రానికి బయల్దేరారు. నిర్మల్‌ వైపు నుంచి హైదరాబాద్‌ మార్గంలో వెళ్తున్న వీరి వాహనం నాకాతండా వద్ద ఆగివున్న టిప్పర్‌ను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిశ్‌ థామస్‌, జాలిన్‌, థామస్‌ కుమారుడు అనాలియా అక్కడికక్కడే మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా భాగ్యనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై వలస కూలీలతో వెళుతున్న లారీ బోల్తా పడింది. 29మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా హైదరాబాద్‌ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు బయలుదేరారు.


ప్రమాదస్థలాన్ని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించి కూలీలను పరామర్శించారు. వారికి తక్షణ సహాయం కింద రూ. 10వేలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం లింగోజిగూడెం సమీపంలోని వలస  కార్మికుల శిబిరంలో ఉంటున్న ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ధన్‌రామ్‌ (32) అకస్మాత్తుగా మృతిచెందాడు. వడదెబ్బ కారణంగా మరణించి ఉంటాడని భావిస్తున్నారు.  ఏపీలోని కర్నూలు జిల్లా కొయ్యలకుంట్ల నుంచి నల్లగొండకు వచ్చిన  మద్దిలేటి(45) అనే వలస కార్మికుడు ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్‌ సమీపంలోని యూనిక్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో పని చేస్తున్న ఒడిసా కార్మికుడు రమేశ్‌ సింగ్‌ (40) విద్యుత్తు షాక్‌తో మృతిచెందాడు. ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో ఈ ఘటన జరిగింది. కాగా దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో 60 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-05-17T08:23:35+05:30 IST