నివురు గప్పిన నిప్పులా పీసీసీ!
ABN , First Publish Date - 2020-12-06T08:29:35+05:30 IST
రాష్ట్రంలో వరుస ఓటములను చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. నూతన సారథి ఎంపిక రూపంలో మరో సవాల్ ఎదురవుతోంది.

అధ్యక్ష పదవికి నేతల పోటీ.. రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో సవాల్
వరుస ఎన్నికల్లో ఓటమి.. రంగంలోకి దిగనున్న ఠాగూర్
హైదరాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుస ఓటములను చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. నూతన సారథి ఎంపిక రూపంలో మరో సవాల్ ఎదురవుతోంది. టీపీసీసీ కార్యవర్గ కూర్పులో అసంతృప్తి రాజుకుంటే నేతలకు ప్రత్యామ్నాయ వేదికగా బీజేపీ ఉండడం.. ఆ పార్టీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన సారఽథి ఎంపికకు అధిష్ఠానం సమాయత్తమవుతోంది.
పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్.. ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యనేతల అభిప్రాయాలు సేకరించనున్నట్లు చెబుతున్నారు. వాటి ఆధారంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఆయన నివేదిక సమర్పిస్తారు. కేసీ వేణుగోపాల్, ఠాగూర్ నివేదికలను పరిగణనలోకి తీసుకుని టీపీసీసీ సారఽథి, కార్యవర్గాన్నీ అధిష్ఠానం ప్రకటించనున్నట్లు తెలిసింది.
పార్టీ వర్గాల్లో ఉన్న ప్రచారం ప్రకారం టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ముందు వరుసలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌పై రాజీలేని పోరాటం, ప్రజాకర్షణను పరిగణనలోకి తీసుకుని రేవంత్‌రెడ్డికే పీసీసీ పట్టం కట్టాలంటూ పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. పార్టీలో సీనియారిటీ ఆధారంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తే తమ దారి తాము చూసుకుంటామన్న సంకేతాలను కొందరు నాయకులు ఇస్తున్నారు. పార్టీ పుంజుకోవాలన్నా, దూకుడుగా ముందుకు పోవాలన్నా రేవంత్‌రెడ్డి వంటి ప్రజాకర్షక నేతకే సాధ్యమని మరి కొందరు నేతలు వాదిస్తున్నారు. సావజిఇక సమీకరణాల దృష్ట్యా ఈ సారి బీసీ వర్గానికి పదవి ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఠాగూర్‌కు తమ అభిప్రాయాన్నీ వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.
నేనూ ఆశిస్తున్నా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని తానూ ఆశిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అధిష్ఠానం శ్రీధర్‌బాబుకు ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. కోమటిరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా కలిసి పని చేస్తానని రేవంత్‌రెడ్డి కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
అధిష్టానం సీరియస్
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వరుస ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటునూ ఖాతాలో వేసుకోలేని పరిస్థితికి రావడంపై అధిష్ఠానం సీరియ్‌సగానే ఉంది. ప్రస్తుత పరిస్థితికి పార్టీ రాష్ట్ర నాయకులందరూ బాధ్యులేనని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి మళ్లుతున్న నేపథ్యంలో అధిష్ఠానం అడుగులు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం పూర్తి ప్రక్షాళనకు దిగుతుందా? ఆచి, తూచి వ్యవహరిస్తుందా? అన్నది త్వరలోనే తేలనుంది.