రైతు అమరవీరులకు ప్రజాసంఘాల నివాళి
ABN , First Publish Date - 2020-12-21T04:52:57+05:30 IST
రైతు అమరవీరులకు ప్రజాసంఘాల నివాళి

జనగామ టౌన్, డిసెంబరు 20: రైతాంగ ఉద్యమంలో అమరులైన వీరులకు అదివారం జిల్లా కేంద్రంలో సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. జనగామ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో రైతు అమర వీరుల చిత్రాపటాలు ప్రదర్శించి నినాదాలు చేశారు. అమరుల త్యాగాలు స్మరించి నివాళి అర్పించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు ఎండి అజారుద్దీన్, మిట్యా నాయక్, అంబాటి సత్యానారాయణ, ధర్మభిక్షం, మంగబీరయ్య వెంకట్ పాల్గొన్నారు.
రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
జఫర్‌గడ్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆందోళనలు చేపడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జఫర్‌గడ్‌లో జరిగిన రైతు సంఘం మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేపడుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం..కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. కేంద్రం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పోరాటంలో చనిపోయిన రైతులకు సమావేశంలో నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు ఆకుల సారంగం, కిష్టయ్య, కుమార్, ఎస్.రాజు, గిరి, పురుషోత్తం, సురేశ్, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.