కరోనా ఘంటికలు

ABN , First Publish Date - 2020-04-18T08:10:14+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌-19 కోరలు చాస్తోంది! తొలుత రాజధాని హైదరాబాద్‌ నగరంలో మాత్రమే కనిపించిన వైరస్‌.

కరోనా ఘంటికలు

సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజే 19 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైరస్‌ విజృంభణ

వికారాబాద్‌లో ఒకరి నుంచి 21 మందికి వైరస్‌

నిజామాబాద్‌.. ఆదిలాబాద్‌.. రంగారెడ్డి.. 

అన్నిచోట్లా ఎక్కువ కేసులు మర్కజ్‌ సంబంధితమే!

గ్రేటర్‌లో అత్యధికంగా 417 కరోనా కేసులు

మరో ఆరు జిల్లాల్లో 192 మందికి పాజిటివ్‌

మొత్తం 766 కేసుల్లో 609 ఆ ఏడు జిల్లాల్లోనే!

కరీంనగర్‌ తరహాలో కట్టడి మాత్రమే పరిష్కారం


రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం తాళ్లగూడకు చెందిన మహిళ కేన్సర్‌తో బాధపడుతోంది. ఈనెల 15న కరోనా లక్షణాలున్నాయని గాంధీకి పంపించారు. అక్కడ పాజిటివ్‌ ఉందని రిపోర్టు ఇచ్చారు. కొద్దిసేపటికే  నెగటివ్‌ రిపోర్టు సోషల్‌ మీడియాలో వచ్చింది. చివరికి పాజిటివేనని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు.


వికారాబాద్‌లో 15 పాజిటివ్‌ కేసులు నమోదైన ఒక కాలనీలో.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి 311 మంది నమూనాలు సేకరించారు. కాలనీవాసుల్లో ఒక్కర్ని కూడా వదలకుండా.. అందరి నుంచి నమూనాలూ సేకరించి వైద ్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉంది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కొవిడ్‌-19 కోరలు చాస్తోంది! తొలుత రాజధాని హైదరాబాద్‌ నగరంలో మాత్రమే కనిపించిన వైరస్‌.. ఇంతింతై వైరస్‌ అంతై.. అన్నట్టుగా విజృంభించి పలు జిల్లాలకు పాకుతోంది!! అటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నుంచి ఇటు సూర్యాపేట దాకా చాలా జిల్లాల్లో విశ్వరూపం చూపుతోంది. నిజానికి.. ఏప్రిల్‌ ఏడు నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ.. మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం కొత్తగా పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతూ మొత్తం కేసుల సంఖ్య 766కు చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 20 కేసులు నమోదు కాగా.. అందులో 19 కేసులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనివే కావడం గమనార్హం. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని ఈదులగూడేనికి చెందిన ఓ మహిళ కరోనా బారిన పడ్డారు. ఆ మహిళ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి సమీప బంధువు కావడంతో రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా, శుక్రవారం ఫలితాల్లో పాజిటివ్‌గా నమోదైంది. 


వికారాబాద్‌ జిల్లా..

వికారాబాద్‌ జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ జిల్లా కేంద్రంలో అనూహ్య రీతిలో వైరస్‌ విజృంభించడానికి ఒక్కరే కారణమయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో ముగ్గురు కరోనా బారినపడగా.. వారిలో ఒకరి నుంచి 21 మందికి వైరస్‌ సోకింది. జిల్లా కేంద్రంలో మదర్సా నిర్వహిస్తున్న ఆ వ్యక్తి ఢిల్లీలో మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి.. అక్కడి నుంచి మార్చి 19న ఇక్కడకు వచ్చారు. 20 నుంచి 23 వరకూ.. నాలుగు రోజుల పాటు ఆయన వికారాబాద్‌ పట్టణంలో ఇతర మదర్సాల నిర్వాహకులు, మత ప్రచారకులను కలిసి మర్కజ్‌ విశేషాలను వివరించారు. అలాగే.. తెలిసినవారి ఇళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి వల్ల వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నట్టు గుర్తించిన కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేయగా, అధికారులు ఆరా తీసి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన నమూనాలు సేకరించి వైద్యపరీక్షలకు పంపగా పాజిటివ్‌ వచ్చింది.


మర్కజ్‌ నుంచి వచ్చాక ఆయన ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని ఆయన నుంచి తెలుసుకునేందుకు అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆయన సరిగ్గా చెప్పకపోవడంతో అధికారులు కష్టపడి తెలుసుకునేసరికి జరగకూడని నష్టం జరిగిపోయింది. వికారాబాద్‌లో 21 మందికి ఆయన నుంచి కరోనా సోకింది. దీంతో ఆయన కలిసినవారిని గుర్తించి కాంటాక్ట్‌ చైన్‌ను బ్రేక్‌ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వికారాబాద్‌లో 15 పాజిటివ్‌ కేసులు నమోదైన ఒక కాలనీలో.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి 311 మంది నమూనాలు సేకరించారు. కాలనీవాసుల్లో ఒక్కర్ని కూడా వదలకుండా.. అందరి నుంచి నమూనాలూ సేకరించి వైద ్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉంది.


ఆదిలాబాద్‌.. రంగారెడ్డి.. నిజామాబాద్‌..

ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లాకేంద్రంలోని ఒక కాలనీలో.. 17 మంది సభ్యులున్న కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ సోకింది. దీంతో మిగతా 14 మందినీ అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. కొత్తగా నమోదైన మూడు కేసులతో కలిపి.. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14కు చేరింది. ఇక.. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం మూడుపాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఆ జిల్లాలో 52 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 29 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారే. నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 58 కేసులు నమోదయ్యాయి.


జిల్లా నుంచి మొత్తం 63 మంది మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లగా.. వారిలో 32 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నుంచి కుటుంబసభ్యుల్లో 20 మందికి సోకింది. వారిన కలిసిన ప్రైమరీ కాంట్టాక్టులో ఐదుగురికి.. దుబాయ్‌ నుంచి వచ్చిన ఒకరికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 417 మందికి వైరస్‌ సోకగా.. నిజామాబాద్‌, రంగారెడ్డి, గద్వాల, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, సూర్యాపేట జిల్లాల్లో 192 కేసులు నమోదయ్యాయి. అంటే.. ఇప్పటిదాకా పాజిటివ్‌గా తేలిన 766 మందిలో 609 మంది ఈ ఏడు జిల్లాలవారే. దీంతో ఆయా జిల్లాలపై వైద్య ఆరోగ్యశాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది. అక్కడ కట్టడి చేస్తే వైరస్‌ ఉధృతి తగ్గుతుందని.. మిగిలిన జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అంత తీవ్రంగా లేదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-18T08:10:14+05:30 IST