సీమ ప్రాజెక్టుపై పునర్విచారణ
ABN , First Publish Date - 2020-08-22T08:58:06+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అనుమతులపై పునర్విచారణ జరిపేందుకు
- తెలంగాణ అభ్యర్థనకు ఎన్‌జీటీ ఓకే
- పిటిషనర్, టీ సర్కారు కుమ్మక్కు
- ఏపీ తరఫు లాయర్ ఆరోపణ
- తదుపరి విచారణ 28కి వాయిదా
- అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అనుమతులపై పునర్విచారణ జరిపేందుకు జాతీయ హరిత ధర్మాసనం(ఎన్జీటీ) అంగీకరించింది. దీనిపై ధర్మాసనం ఇప్పటికే విచారణ ముగించి తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రా జెక్టును ఆపాలంటూ తొలుత నారాయణపేట జిల్లాకు చెందిన జి. శ్రీనివాస్ వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని పేర్కొంటూ సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికపై తమ పరిశీలన లు, అభ్యంతరాలు తెలియజేయడానికి కేసును తిరిగి విచారించాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తుపై శుక్రవారం ఎన్జీటీలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలు కూడా వింటామని, లేదంటే తమకు వాదనలకు అవకాశమివ్వలేదని సుప్రీంకోర్టుకు వెళ్లే అవకా శం ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 28న తుది వాదనలు వింటామని ప్రకటిస్తూ తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేసింది.