దినపత్రికలు చదవడం మొదలెట్టా.. విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
ABN , First Publish Date - 2020-04-05T18:50:15+05:30 IST
దినపత్రికలపై కరోనా వైరస్ ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నా... కొంతమంది న్యూస్ పేపర్లను చదవడానికి విముఖత చూపుతున్నారు.

హైదరాబాద్: దినపత్రికలపై కరోనా వైరస్ ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నా... కొంతమంది న్యూస్ పేపర్లను చదవడానికి విముఖత చూపుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల క్రితం వరకు తాను ఆన్లైన్ పేపర్ చదివేవాడినని.. ఇప్పుడు మాత్రం దినపత్రికలే చదువుతున్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తాను పేపర్ చదివే ముందు దాన్ని మైక్రోవేవ్‌లో నిమిషం పాటు పెట్టి అనంతరం చదువుతున్నానంటూ దాని వీడియో అప్లోడ్ చేశారు. మైక్రోవేవ్‌లో పెడితే వైరస్ చనిపోతుందా అని అంటూనే.. దానిపై అంతగా పరిశోధనలు జరగలేదని చెప్పారు. హెచ్‌సీవీ, హెచ్‌సీవీ/హెచ్ఐవీ-1, పారైన్ఫ్ల్యూయెంజా, హెపటైటిస్ సీ లాంటి వైరస్లు మాత్రం చనిపోతాయని పేర్కొన్నారు.
పత్రికారంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని.. అంతేగాక ఆ వ్యవస్థపై ఆధారపడ్డ న్యూస్ పేపర్ డెలివరీ బాయ్స్‌కు కూడా మద్దతు తెలపాలన్నారు. దీంతోపాటు ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన వార్తా కథనాన్ని తన ట్వీట్‌కు జత చేశారు. న్యూస్ పేపర్లను అడ్డుకోవడం చట్టరిత్యా నేరమంటూ ప్రముఖ న్యాయవాదులు పేర్కొన్న విషయాన్ని తెలుపుతూ ఆ వార్తా కథనం సాగుతోంది.
విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్‌పై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్రికారంగం అంటే కేవలం రిపోర్టర్లు, సంపాదకులు, మాత్రమే కాదని.. వాటి ముద్రణలో పాల్గొనే సిబ్బంది నుంచి డెలీవరీ బాయ్‌ల వరకు ఎంతో మంది ఉంటారని అంటున్నారు. దినపత్రికలను అడ్డుకుంటే ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఆంధ్రజ్యోతి తన పత్రికలను శానిటైజ్ చేసి మార్కెట్లో పంపిణీ చేస్తోంది. ప్రజారోగ్యంపై రాజీపడేది లేదన్న విషయం తెలిసిందే.