గోలేటిలో కొత్తగా ఓపెన్‌ కాస్ట్‌!

ABN , First Publish Date - 2020-12-26T07:16:58+05:30 IST

కొత్తగా మరో ఉపరితల గని(ఓపెన్‌ కాస్ట్‌) ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. బెల్లంపల్లి ఏరియా పరిధిలోని కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గోలేటిలో మూతపడ్డ భూగర్భ గనులకు ప్రత్యామ్నాయంగా

గోలేటిలో కొత్తగా ఓపెన్‌ కాస్ట్‌!

ఇప్పటికే సర్వే పూర్తి చేసిన సింగరేణి సంస్థ

ప్రాథమికంగా 900 ఎకరాల్లో ప్రాజెక్టు

సంస్థ ఆధీనంలో 450 ఎకరాల భూమి

మరో 450 ఎకరాల కోసం ప్రతిపాదనలు

త్వరలో అటవీ శాఖ అనుమతులు వచ్చే చాన్స్‌

మూతపడిన భూగర్భ గనులకు ప్రత్యామ్నాయం

ఇక్కడ 35-40 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు

ఏటా 3 మిలియన్‌ టన్నులు వెలికి తీసే అవకాశం


ఆసిఫాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొత్తగా మరో ఉపరితల గని(ఓపెన్‌ కాస్ట్‌) ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. బెల్లంపల్లి ఏరియా పరిధిలోని కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గోలేటిలో మూతపడ్డ భూగర్భ గనులకు ప్రత్యామ్నాయంగా ఓపెన్‌ కాస్ట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సర్వేను పూర్తి చేసిన సంస్థ.. అటవీ, పర్యావరణ బోర్డు అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టు ద్వారా పదేళ్ల పాటు బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.


గోలేటిలో భారీగా బొగ్గు నిల్వలు

ప్రస్తుతం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలోని ఖైరిగూడ ఉపరితల గని ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్రాంతంలోని గోలేటి-1, గోలేటి-2 భూగర్భ గనులు గతంలోనే మూతపడ్డాయి. వాటికి ప్రత్యమ్నాయంగా కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు గతంలోనే సింగరేణి ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతంలో ఇంకా గనులు తవ్వేందుకు ఎంత మేరకు అవ కాశం ఉందన్న కోణంలో ఐదేళ్ల క్రితమే సర్వే చేపట్టింది. గోలేటి-1 భూగర్భ గని పరిసరాల్లో డ్రిల్లింగ్‌ చేపట్టి ఇంకా 35-40 మిలియన్‌ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఇక్కడ ఓపెన్‌ కాస్ట్‌ ఏర్పాటుకు యాజమాన్యం పచ్చజెండా ఊపిన తర్వాత పర్యావరణ అనుమతులు, భూ సేకరణ సంబంధిత అంశాలపై అధికార యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. 


900 ఎకరాల్లో కొత్త ఓపెన్‌కా్‌స్ట

మూతబడిన గోలేటి-1 భూగర్భ గని ప్రాంతాన్ని ఓపెన్‌కా్‌స్టగా మార్చి తవ్వకాలు జరపాలని సింగరేణి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం అప్పట్లోనే భూసేకరణపై దృష్టి సారించింది. ఇక్కడ కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు 900 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేసింది. ఇక్కడ సింగరేణి అధీనంలో సుమారు 450 ఎకరాల భూములు అందుబాటులో ఉండగా, మరో 450  ఎకరాల అటవీ శాఖ భూమి అవసరమవుతుందని గుర్తించింది. ఈ మేరకు భూములు కేటాయించాలని కోరుతూ అటవీశాఖ, పర్యావరణ బోర్డుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు సింగరేణి తరపున అడవుల అభివృద్ధికి సహకరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి అటవీ, పర్యావరణ శాఖల బృందాలు క్షేత్ర స్థాయి స్థితిగతులను పరిశీలించి వెళ్లాయి.


పదేళ్ల పాటు నిరాటంకంగా ఉత్పత్తి

ఓపెన్‌కా్‌స్టకు అనుమతి లభిస్తే ప్రస్తుతం ఉన్న గోలేటి టౌన్‌లో కొంత భాగం భూ సేకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. తొలి దశలో గుండాల వాగు వరకు ఈ గనిని విస్తరించనున్నారు. రెండో దశలో భగత్‌సింగ్‌ నగర్‌ మీదుగా మానెపల్లి కుంట వరకూడా పొడిగించాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటైతే ఏటా 3 మిలియన్‌ టన్నుల చొప్పున 10-12 ఏళ్ల పాటు నిరాటంకంగా బొగ్గును వెలికి తీసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-26T07:16:58+05:30 IST