స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులతో కొత్త స్ట్రెయిన్‌!

ABN , First Publish Date - 2020-12-30T08:39:59+05:30 IST

కరోనా వైర్‌సకు అత్యంత కీలకమైన స్పైక్‌ ప్రొటీన్‌లో 17 చోట్ల కొత్త జన్యుమార్పులు జరిగినందు వల్లే కొత్త స్ట్రెయిన్‌ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులతో కొత్త స్ట్రెయిన్‌!

‘ఆంధ్రజ్యోతి’తో పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి 

వ్యాక్సిన్లతో కట్టడి సాధ్యమే 


కరోనా వైర్‌సకు ఆరోప్రాణమైన స్పైక్‌ ప్రొటీన్‌లో చోటు చేసుకున్న మార్పులే కొత్త స్ట్రెయిన్‌కు జీవంపోశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్ర సలహా సంఘం సభ్యుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి అంటున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌లు దీన్ని కూడా సమర్ధంగా నిరోధించగలవని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. కొత్త స్ట్రెయిన్‌కు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉన్నందున, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేసులు అమాంతం పెరిగిపోతాయని హెచ్చరించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ‘ఆంధ్రజ్యోతి’తో శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే.. 


కరోనా వైర్‌సకు అత్యంత కీలకమైన స్పైక్‌ ప్రొటీన్‌లో 17 చోట్ల కొత్త జన్యుమార్పులు జరిగినందు వల్లే కొత్త స్ట్రెయిన్‌ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఒక కరోనా రోగి నుంచి కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి ప్రారంభమైంది. వైరస్‌ అతనిలో చాలా కాలం చైతన్యంగా ఉండటం వల్ల, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌లో పలు కొత్త మార్పులు జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైర్‌సలో ఎన్ని ఎక్కువ మార్పులు జరిగితే అంత వేగంగా అది బలహీనపడే అవకాశం ఉంది. అయితే ఈక్రమంలో మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త స్ట్రెయిన్‌ పూర్తి స్వభావం గురించి ఇంకా అధ్యయనాలు జరగాల్సి ఉంది. కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ, దానివల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ తీవ్రత అంతగా లేకపోవడం ప్రస్తుతానికి ఊరట కలిగించే అంశమే. 


బ్రిటన్‌లో సెప్టెంబరులోనే..

వాస్తవానికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ బ్రిటన్‌లో సెప్టెంబరులోనే బయటపడింది. దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో డిసెంబరు నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటన్‌ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు కొత్త స్ట్రెయిన్‌ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. బ్రిటన్‌ నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు భారత్‌కు వచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. బ్రిటన్‌తో పాటు ఇతరత్రా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి టెస్టులు చేయడంతో పాటు వారితో సన్నిహితంగా మెలిగినవారి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది.

  

వేషం మార్చుకున్నా దొంగ దొంగే.. 

ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లను ఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ టీకాల ప్రభావం కొత్త స్ట్రెయిన్‌పైనా ఉంటుందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు. ఒక వేళ అవి సమర్ధంగా పనిచేయకపోయినా నిర్వీర్యం చేసిన వైరస్‌ నుంచి తయారుచేసిన ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్‌, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్‌ను నిరోధించగలవు అనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక వ్యాక్సిన్‌లు సిద్ధమవుతున్నందున.. కరోనా వైర్‌సను త్వరలోనే జయించగలమనే ధీమా సర్వత్రా వ్యక్తమవుతోంది. వేషం మార్చుకున్నా దొంగ దొంగే. కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌గా రూపం మార్చుకున్నా మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అసలే చలికాలం. కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మే వరకు మనమంతా అప్రమత్తంగా ఉండటం అనివార్యం. 

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-12-30T08:39:59+05:30 IST