రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్‌

ABN , First Publish Date - 2020-12-29T07:10:13+05:30 IST

కరోనా కొత్త స్ట్రెయిన్‌ రాష్ట్రంలో ఒకరిలో నిర్ధారణ అయింది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది

రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్‌

యూకే నుంచి వచ్చిన వరంగల్‌ వాసిలో నిర్ధారణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు!

వరంగల్‌ వాసి ముగ్గురు కాంటాక్టుల్లో తల్లికి కరోనా పాజిటివ్‌ 

బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో 21 చేరిన కొవిడ్‌ కేసులు

కొత్త స్ర్టెయిన్‌ను గుర్తించేందుకు హైదరాబాద్‌లో 2 ల్యాబ్‌లు


హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త స్ట్రెయిన్‌ రాష్ట్రంలో ఒకరిలో నిర్ధారణ అయింది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. కాగా, యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. వివరాలను ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొత్త స్ట్రెయిన్‌ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం వెల్లడించనుంది. సోమవారమే ప్రకటించాల్సి ఉండగా ఒకరోజు వాయిదా పడింది. వైరస్‌ వ్యాప్తి తొలినాళ్లలో రాష్ట్రాల వారీ కేసుల సంఖ్యను కేంద్రమే ప్రకటించేది.


అనంతరం రాష్ట్రాలే బులెటిన్‌ ఇస్తున్నాయి. కొత్త స్ట్రైయిన్‌ కేసుల వివరాలను మాత్రం కేంద్రమే ప్రకటిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో సోమవారం మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఇతడికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలింది. అయితే, లక్షణాలు మాత్రం లేవు. దీంతో మొత్తం సంఖ్య 21కి పెరిగింది. యూకే, యూకే మీదుగా డిసెంబరు 9 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రానికి 1,216 మంది వచ్చారు. ఇందులో 1,060 మందిని గుర్తించారు. ఆరుగురు విదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 58 మంది సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలకు అందించారు. రాష్ట్రంలో ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్‌లు 21 మందిలో హైదరాబాద్‌వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.


పరిస్థితిపై ఈటల సమీక్ష

రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రైయిన్‌ కేసు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త రకం వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందా? కేంద్రం ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తుందో పరిశీలించి వాటిప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు. కాగా, యూకే నుంచి వచ్చినవారిలో.. 1,060మందిని కేవలం 72గంటల్లో గుర్తించి 996మందికి పరీక్షలు చేయడంపై ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు, ఆయన బృందాన్ని మంత్రి ఈటల అభినందించారు.


రాష్ట్రంలో మరో 205 కేసులు

రాష్ట్రంలో ఆదివారం 205 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ఇద్దరు మృతి చెందారు. 551 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నాలుగు జిల్లాల్లోనే పదిపైగా కేసులు వచ్చాయి. 27,244 మందికి పరీక్షలు చేశారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,85,068కు, మరణాల సంఖ్య 1533కు చేరింది. 6,231 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 55, కరీంనగర్‌లో 13, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్‌ అర్బన్‌లో 10 నమోదయ్యాయి.

Updated Date - 2020-12-29T07:10:13+05:30 IST