కేసులు తగ్గుతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త చిక్కు..!

ABN , First Publish Date - 2020-05-13T18:18:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సొంత రాష్ట్రానికి వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇదే

కేసులు తగ్గుతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త చిక్కు..!

కొత్తవాళ్లతోనే చిక్కులు.. కరోనా కేసులు పెరిగే ప్రమాదం..!

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారితో కరోనా కేసులు పెరిగే ప్రమాదం

ఇప్పటికే 275 మందిరాక.. అనధికారికంగా మరో వెయ్యి మంది

ఆందోళనలో యంత్రాంగాలు..అప్రమత్తమైన పోలీసులు


హన్మకొండ/వరంగల్ (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సొంత రాష్ట్రానికి వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికారులకు, పోలీసులు, వైద్యసిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. నిబంధనలు సడలించడంతో వివిధ రాష్ట్రాల నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. మే 7 తర్వాత నుంచి చాలా మంది చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇలా వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడుతుండడంతో ఉమ్మడి జిల్లా అధికారులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పక్షం రోజులుగా కరోనా కేసుల్లేవు.  హమ్యయ్యా! అని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ కొత్తచిక్కొచ్చిపడింది. 


కొత్త సమస్య..

సడలింపుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లాల యంత్రాంగాలు ఆందోళన చెందుతున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ వల్ల 50 రోజులుగా చిక్కుకుపోయిన ఉద్యోగులు, విద్యార్ధులు జిల్లాకు వస్తున్నారు. వీరు కొద్ది సంఖ్యలో ఉంటారు కనుక వీరితో కూడా పెద్ద సమస్యే లేదు. అసలు ప్రమాదం కూలీలు. కళ్ళుగప్పి వివిధ మార్గాల ద్వారా వస్తున్న వీరిని గుర్తించడమే ఇప్పడు అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు సవాల్‌గా మారింది.


మహారాష్ట్ర నుంచి రైలు

లాక్‌డౌన్‌ వల్ల మహారాష్ట్రలో చిక్కుకుపోయిన 14 మందితో కూడిన మొదటి బ్యాచ్‌ రైలు శుక్రవారం వరంగల్‌కు చేరుకుంటోంది. అలాగే మరో 20 మందితో కూడిన బృందం ఈనెల 15న వస్తోంది. వీరేకాకుండా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన చాలా మంది వరంగల్‌కు రావడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు సమాచారం అందింది. బీమండి, మహారాష్ట్ర నుంచి జనగామ జిల్లాకు ఇప్పటికే 275 మంది వచ్చారు. వీరిలో 170 మందికి పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌కు తరలించారు. పోలీసుల కళ్ళు గప్పి అనధికారికంగా మరో వెయ్యి మంది జిల్లాలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. వారి సంగతేమిటన్నదే ప్రశ్న. తమ దృష్టికి రానివారిని గుర్తించడమెట్లా అని తలలు పట్టుకుంటున్నారు.


ఆరా..

పొరుగు రాష్ట్రాల నుంచి దొంగచాటుగా జిల్లాల్లోకి చొరబడేవారి గురించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. సరిహద్దుల ద్వారా ప్రవేశించే వారి ప్లేను నమోదు చేస్తున్నారు. మే 7 తర్వాత గ్రామాలకు వస్తున్నవారి వివరాలనూ తమకు వెంటనే తెలియచేయాల్సిందిగా స్థానిక ప్రజలను కోరుతున్నారు. కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపించినా తక్షణమే ఆ విషయాన్ని తమకు చేరవేయాల్సిందిగా పోలీసులు, వైద్యాధికారులు కోరుతున్నారు. ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు ఇటువంటి వారి ఇళ్ళకు వెంటనే వెళ్ళి క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశిస్తున్నారు.


ట్రాకింగ్‌ యాప్‌తో..

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారింటికి పోలీసులు వెళుతున్నారు. వీరు కోవిడ్‌-19 ట్రాకింగ్‌ యాప్‌ను వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నారు. దీని ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వైద్య, రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఇతర రాష్ర్టాలు, లేదా జిల్లాల నుంచి వచ్చినవారు తమ వివరాలను తప్పని సరిగా తెలియచేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు కోరారు. ఇందు కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టోల్‌ఫ్రీ  నెంబర్‌ 7993969104కు తెలియచేయాలని సూచించారు. 


ట్రాకింగ్‌ యాప్‌తో..

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారింటికి పోలీసులు వెళుతున్నారు. వీరు కోవిడ్‌-19 ట్రాకింగ్‌ యాప్‌ను వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నారు. దీని ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వైద్య, రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఇతర రాష్ర్టాలు, లేదా జిల్లాల నుంచి వచ్చినవారు తమ వివరాలను తప్పని సరిగా తెలియచేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు కోరారు. ఇందు కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టోల్‌ఫ్రీ  నెంబర్‌ 7993969104కు తెలియచేయాలని సూచించారు. 

Read more