కొవిడ్ చికిత్సకు కొత్త ఔషధాలు!
ABN , First Publish Date - 2020-06-25T08:28:18+05:30 IST
కరోనా చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త ప్రయోగాత్మక ఔషధాలను రోగులపై పరీక్షించే ప్రక్రియ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమైంది.

8 14 మంది రోగులపై ప్రయోగాలు.. ‘గాంధీ’లో సత్ఫలితాలు
హైదరాబాద్ సిటీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : కరోనా చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త ప్రయోగాత్మక ఔషధాలను రోగులపై పరీక్షించే ప్రక్రియ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమైంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు గాంధీలో చికిత్స పొందుతున్న 14 మంది కొవిడ్ రోగులపై గత కొద్ది రోజులుగా వీటిని పరీక్షిస్తున్నారు. ఈ జాబితాలో పలు ఫార్మా కంపెనీల వ్యాక్సిన్లు, ఔషధాలు ఉన్నాయి. రెమ్‌డెసివిర్ మాత్రలతో కొవిడ్ రోగుల్లో సత్ఫలితాలు వచ్చాయని, వారు కోలుకుంటున్నారని సమాచారం. కొత్త ఔషధాలను రోగులపై పరీక్షించేందుకు గాంధీకి అనుమతి లభించిన విషయాన్ని గుట్టుగా ఉంచే ప్రయత్నం జరిగింది. విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ వివరాలను తెలుసుకున్న ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 15నే దానిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు అందుకు అనుగుణంగానే కరోనా రోగులపై ఔషధ పరీక్షలు జరుగుతుండటం కరోనా కట్టడికి ప్రభావవంతంగా ఉపయోగపడతాయనే అంచనాలున్న ఔషధాలతో రోగులపై పరీక్షిస్తోంది. ప్రస్తుతానికి కరోనా వచ్చి ఇతర రోగాలు లేని వ్యక్తులపై మాత్రమే ఔషధాలను పరీక్షిస్తున్నారు. రోగులను స్వల్ప, మధ్యస్థ, తీవ్ర కరోనా లక్షణాలు అనే మూడు కేటగిరీలుగా విభజించి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్లాస్మా థెరపీ చేసి పలువురు రోగుల ప్రాణాలను గాంధీ వైద్యులు కాపాడారు. ఇదే తరహాలో వ్యాక్సిన్లు, ఔషధాలతో గాంధీ ఆస్పత్రిలో ఔషధ పరీక్షల నిర్వహణకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)తో ఒప్పందం కుదిరింది. దీంతో యాంటీవైరల్ ఔషధాలను ప్రయోగపూర్వకంగా కరోనా పాజిటివ్ రోగులకు అందించి, వస్తున్న ఫలితాలను నమోదు చేస్తున్నారు. సత్ఫలితాలు వచ్చే ఔషధాలను ఇతర రోగులకు అందించేందుకు ఈ నివేదికలే ప్రాతిపదికగా నిలువనున్నాయి.