మెసేజ్ ద్వారా నెగెటివ్..ఫోన్ ద్వారా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-06-25T12:47:54+05:30 IST
మెసేజ్ ద్వారా నెగెటివ్..ఫోన్ ద్వారా పాజిటివ్!

ఓ అధికారి రిపోర్ట్‌ల విషయంలో గందరగోళం
హైదరాబాద్/కుత్బుల్లాపూర్(ఆంధ్రజ్యోతి) : కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం సర్కిల్‌కు చెందిన ఓ అధికారికి కరోనా సోకింది. ఇటీవల జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో విధుల్లో భాగంగా కొంత మంది సిబ్బందిని కలిశారు. వారిలో కరోనా ఉన్న వారి ద్వారా ఆయనకు వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటి నుంచి కొంత అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 20వ తేదీన పరీక్షల నిమిత్తం సూరారంలోని యూపీహెచ్‌సీకి అతని పీఏ, డ్రైవర్‌తో పాటు కలిసి వెళ్లి ముగ్గురూ నమూనాలు ఇచ్చారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం వారి ఫోన్లకు కరోనా నెగెటివ్ అనే సందేశాన్ని పంపించారు. దీంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ఆ ముగ్గురికి, కార్యాలయ సిబ్బందికి బుధవారం ఉదయాన్నే పెద్ద షాక్ తగిలింది. బుధవారం ఉదయం ఆ అధికారికి నిమ్స్ ఆస్పత్రి నుంచి ఒకరు ఫోన్ చేసి ‘మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఐసోలేషన్‌లోనే ఉండాలి’ అని తెలపడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆయన పీఏ, డ్రైవర్, కార్యాలయ ఇతర అధికారులు, సిబ్బందితో పాటు ఆయనను కలిసిన వారంతా భయాందోళనలో ఉన్నారు. బుధవారం కార్యాలయం మొత్తం భవనాన్ని సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేసి అధికారి గదికి తాళం వేశారు. ఇదే విషయంపై ఆయనను ఫోన్ ద్వారా ఆంధ్రజ్యోతి సంప్రదించగా మంగళవారం రాత్రి పదిన్నరకు ఎస్‌ఎంఎస్ ద్వారా నెగెటివ్ అనే సందేశాన్ని పంపారని, ఉదయం ఫోన్ చేసి పాజిటివ్ వచ్చింది ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపారని అన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు వెల్లడించారు. ఓసారి నెగెటివ్, మరోసారి పాజిటివ్ అంటూ బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తారని అధికారుల తీరును పలువురు విమర్శిస్తున్నారు.