నాలుగుసార్లు నెగెటివ్‌.. మృతిచెందాక పాజిటివ్‌!

ABN , First Publish Date - 2020-07-18T07:59:28+05:30 IST

ఆయన పేరు ప్రేమ్‌కుమార్‌. బంజార్‌ హిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఏఎ్‌సఐగా పనిచేస్తున్నారు. నాలుగుసార్లు పరీక్ష చేయించుకున్నా.. కరోనా నెగెటివ్‌గానే వచ్చింది. కానీ, సంబంధిత లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో నగరంలోని ఆస్పత్రులకు తరలించగా

నాలుగుసార్లు నెగెటివ్‌.. మృతిచెందాక పాజిటివ్‌!

బంజారాహిల్స్: ఆయన పేరు ప్రేమ్‌కుమార్‌. బంజార్‌ హిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. నాలుగుసార్లు పరీక్ష చేయించుకున్నా.. కరోనా నెగెటివ్‌గానే వచ్చింది. కానీ, సంబంధిత లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో నగరంలోని ఆస్పత్రులకు తరలించగా.. 40 గంటల పాటు ఏ ఒక్క ఆస్పత్రి కూడా ఆయన్ను అనుమతించలేదు. ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు దొరికింది. అక్కడ నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అయితే.. ఆ ఫలితాలు వచ్చేలోపే ప్రేమ్‌కుమార్‌ కన్నుమూశారు.


ప్రేమ్‌కుమార్‌ (53) మూడేళ్లుగా బంజారాహిల్స్‌ ఠాణాలో ఎస్సైగా  విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌లో సుమారు 26 మంది సిబ్బంది కరోనా బారిన పడటంతో, ప్రేమ్‌ కూడా పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్‌ అని తేలడంతో ఊపిరి పీల్చుకొని తిరిగి విధులకు హాజరయ్యారు. ఉన్నతాధికారుల సలహా మేరకు మరోసారి చేయించుకున్నా నెగెటివ్‌ అనే వచ్చింది. అయితే.. ఇది జరిగిన పదిరోజులకు జ్వరం వచ్చింది. మళ్లీ పరీక్షలు చేయించినా నెగెటివ్‌గానే తేలింది. ఈ నెల 14 ఉదయం ప్రేమ్‌ పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు అస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పడకల్లేవని తేల్చి చెప్పడంతో.. మరో రెండు అస్పత్రుల్లో, గాంధీలో ప్రయత్నించారు. ఎక్కడా చేర్చుకోలేదు. కరోనా నెగటివ్‌ ఉందన్న కారణంతో గాంధీ ఆసుపత్రిలోనూ పడక దొరకలేదు. విషయాన్ని ఆయన అల్లుడు పై అధికారులకు తెలియజేయడంతో.. వారు మూడు ప్రైవేటు అస్పత్రుల్లో ప్రయత్నించి, తిరిగి గాంధీ ఆస్పత్రిలోనే చేర్చారు.


ఈ నెల 15న ఓ ఎస్‌ఐ కృషితో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు అస్పత్రిలో ఎట్టకేలకు చోటు దొరికింది. అప్పటికే ప్రేమ్‌ కుమార్‌ ఆరోగ్యం విషమించి 40గంటలు దాటడంతో వైద్యులు ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. ఇక్కడ కరోనా పరీక్షలోనూ నెగటివ్‌ అనే వచ్చింది. ఇది జరిగిన మరుసటి రోజే ఆయన మూత్రపిండాలు విఫలమయ్యాయి. అనుమానం వచ్చిన వైద్యులు మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు వచ్చేలోపే.. గురువారం రాత్రి ప్రేమ్‌ తుది శ్వాస విడిచారు. అనంతరం వచ్చిన పరీక్షల ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పరీక్షల్లో అన్ని సార్లు నెగటివ్‌ రావడమే ప్రేమ్‌ మృతికి కారణమైందంటూ ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఆ ప్రైవేటు ఆస్పత్రి వారికి రూ. 6లక్షల బిల్లు వేసింది. అంత కట్టలేమని కుటుంబసభ్యులు వేడుకోవడంతో.. బంజారాహిల్స్‌ ఏసీపీ కెఎస్‌ రావు, సీఐ కళింగరావు అస్పత్రి నిర్వాహకులతో మాట్లాడి బిల్లును మాఫీ చేయించారు.

Updated Date - 2020-07-18T07:59:28+05:30 IST