పచ్చనిచెట్టుపై ప్రకృతి కన్నెర్ర!

ABN , First Publish Date - 2020-05-18T09:40:38+05:30 IST

మానవ మనుగడకు మూలాధారం చెట్లు. ప్రకృతిపై బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న మనిషి.. దశాబ్దాలుగా చెట్లను నాశనం చేస్తున్నాడు. ఈ పరిణామాలపై ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను మనిషి ఆలస్యంగా గుర్తించాడు. దిద్దుబాటు చర్యలు ప్రారంభించాడు

పచ్చనిచెట్టుపై ప్రకృతి కన్నెర్ర!

మానవ మనుగడకు మూలాధారం చెట్లు.  ప్రకృతిపై బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న మనిషి.. దశాబ్దాలుగా చెట్లను నాశనం చేస్తున్నాడు. ఈ పరిణామాలపై ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను మనిషి ఆలస్యంగా గుర్తించాడు. దిద్దుబాటు చర్యలు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ‘హరిత హారం’ లాంటి పథకాలతో లక్షల కొద్దీ మొక్కలు నాటడం ప్రారంభించాడు. ఇప్పుడిప్పుడే ఆ ఫలాన్ని అనుభవిస్తున్నారు. నిర్దయతో వ్యవహరించిన మనిషిపై ప్రకృతి పగబట్టినట్టుంది. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో తన బిడ్డల్ని(చెట్లను) తానే చంపుకుంటోంది. 


హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వికృత రూపం దాలిస్తే ఎలా ఉంటుందో... నిన్న నగరంలో కురిసిన భారీ వర్షం మిగిల్చిన అనవాళ్లు చూస్తే అర్థమవుతుంది. ఒక గంట పాటు కురిసిన వర్షానికి, భారీ గాలులకు భారీ వృక్షాలు సైతం కుప్పకూలిపోయాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ సహా నగరంలో ఎక్కడ చూసినా కూలిన చెట్లే. దీనివల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ జాములే. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎమర్జెన్సీ బృందాలు.. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూలిన చెట్లు తొలగించేందుకు రాత్రంతా కష్టపడాల్సివచ్చింది. సంవత్సరాల పాటు పెరిగిన చెట్లు ఒక్క గాలివానకు కుప్పకూలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రకృతి మనిషిపై పగబట్టినట్లుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో నగరంలో కాలుష్యం తగ్గుతోందని ఓ వైపు ఆనందించేలోగానే.. మరోవైపు ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఇప్పుడు కూలిన ఈ చెట్లు మళ్లీ పెరగాలంటే కనీసం మరో ఐదేళ్లు పడుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. 


యజ్ఞంలా చెట్లను పెంచుతున్నా..

హరితహారం పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా కోట్లాది మొక్కలను నాటించి, సంరక్షిస్తోంది. ఈ ప్రక్రియను ఓ యజ్ఞంలా నిర్వహిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. అలా పెరిగి పెద్దవవుతున్న చెట్లు.. ప్రకృతి ఆగ్రహానికి బలవుతున్నాయి. 


పచ్చదనం కోసం ప్రత్యేక విభాగాలు

ప్రభుత్వ శాఖల్లో పచ్చదనం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా విభాగాలే ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు (ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు), ఆ రంగానికి సంబంధించిన నిపుణులు నిరంతరం ఆ దిశగా పనిచేస్తుంటారు. ముఖ్యంగా  హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతియేటా హరితహారం కార్యక్రమం నిర్వహణ కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోనే 36 నర్సరీలు ఉన్నాయి. సుమారు  37 ఉద్యోగులు వారి కింద ప్రైవేటు సంస్థలు, కాంట్రాక్టర్లు, వంద మందికి పైగా  కూలీలు పచ్చదనం కోసం నిరంతరం పనిచేస్తుంటారు. ఏటా కోటి మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడమే వీరి లక్ష్యం.


నేల స్వభావంలో తేడా వల్లే..

హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతమంతా దక్కన్‌ పీఠభూమి. నేలంతా రాళ్లమయంగా ఉంటుంది. ఇలాంటి చోట చెట్ల వేర్లు భూమి లోపలికి చొచ్చుకుని వెళ్లలేవు. నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా పైకి పెరుగుతున్నా, లోపల మాత్రం వాటి వేర్లు పైపైనే ఉంటాయి. ఇందుకు కారణం నేలలో రాళ్లు ఎక్కువగా ఉండడమే. దీంతో వేగంగా గాలి వీచినప్పుడు అవి కూలిపోయే అవకాశం ఉంది.  అదేసమయంలో ఒక చెట్టు ఒక్కో చోట కాకుండా సమూహంగా నాటి పెంచితే అవి భారీ ఎదురుగాలులను కూడా తట్టుకోగలవు.  పైభాగంతో పాటు లోపల వాటి వేర్లు సైతం ఒకదానికొకటి అల్లుకొని గట్టిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. భూమి లోపల వేర్లు ఎంత బలంగా నాటుకుపోయి ఉంటే పైన అంత బలంగా ఉంటాయి.

-శ్రీనివాస్‌, హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు డైరెక్టర్‌


వేర్లు గట్టిగా లేకపోవడంతోనే..

నగరంలో పచ్చనదనం కోసం ఎక్కువగా గుల్‌మహార్‌ అనే రకం చెట్లను పెంచుతుంటారు. ఈ ప్రదేశాల్లో నేల గట్టిగా లేకపోవడం వల్ల వేర్లు లోపలికి ఎక్కువగా చొచ్చుకుపోవు. ఫలితంగా బలంగా వీచే గాలుల కారణంగా వృక్షాలు ఒక్కసారిగా  నేలకూలుతున్నాయి. సాధారణ చెట్లతో పోల్చితే ఈరకం చెట్లు వేగంగా పెరుగుతుంటాయి. ఆ ఉద్దేశంతోనే  నగరంలో వీటిని ఎక్కువగా పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

- మధుసూధన్‌, ఉద్యానవన శాఖ అధికారి

Updated Date - 2020-05-18T09:40:38+05:30 IST