తెలంగాణలో 112 కేంద్రాల్లో నీట్ పరీక్ష..

ABN , First Publish Date - 2020-09-13T12:14:21+05:30 IST

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఆదివారం జరగనుంది. కొవిడ్‌ నిబంధనలకు...

తెలంగాణలో 112 కేంద్రాల్లో నీట్ పరీక్ష..

  • హాజరుకానున్న 15.97 లక్షల మంది 
  • దేశవ్యాప్తంగా 3,843 పరీక్ష కేంద్రాలు
  • రాష్ట్రం నుంచి 55,800 మంది అభ్యర్థులు
  • తెలంగాణలో 112 కేంద్రాల ఏర్పాటు

 హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే  జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఆదివారం జరగనుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహణ కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒక్కో గదిలో కేవలం 12 మంది విద్యార్ధులు పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్‌ రాసే విద్యార్ధులకు డ్రెస్‌ కోడ్‌ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు( బురఖా) ఓ గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలను  హాల్‌ టికెట్‌లో వివరించారు. అలాగే తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం కూడా ఉంచారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు ఉదయం 11గంటల నుంచే అభ్యర్ధులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎంట్రెన్స్‌లోనే జ్వరం ఉందో లేదో పరిశీలించి లోపలికి పంపిస్తారు. అభ్యర్ధులు తమ వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్‌, ట్రాన్స్‌పరెంట్‌ నీళ్లబాటిళ్లను అనుమతిస్తారు. 

ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. ముందుగా 2,546 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా వీటి సంఖ్యను 3,843కి పెంచారు. తెలంగాణ నుంచి 55,800 మంది పరీక్షను రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 112 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-13T12:14:21+05:30 IST