సీఎం కేసీఆర్ అలా చేస్తే మద్దతు ఇస్తాం: నారాయణ

ABN , First Publish Date - 2020-09-14T22:08:03+05:30 IST

తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేస్తే మద్దతు ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.

సీఎం కేసీఆర్ అలా చేస్తే మద్దతు ఇస్తాం: నారాయణ

హైదరాబాద్: తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేస్తే మద్దతు ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేసీఆర్ జాతీయ పార్టీ ఆచరణలోకి వచ్చినప్పుడు మద్దతునిచ్చే అంశంపై ఆలోచిస్తామన్నారు. రాష్ట్ర హక్కులను హరించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జీఎస్టీ ప్రతిపాదన తీసుకువస్తే.. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ వ్యతిరేకించారని అన్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత జీఎస్టీ తీసుకువచ్చారని.. అయితే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వలేదని, కోవిడ్ అని ఏవేవో కారణాలు చెబుతున్నారని విమర్శించారు.

 

నోటిఫికేషన్ వచ్చాకే దుబ్బాక ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు. రెవెన్యూ చట్టంపై అభిప్రాయం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆరే చాడ వెంకట్‌రెడ్డిని పిలిపించుకున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రిని కలవకూడదా? అని నారాయణ ప్రశ్నించారు.

Updated Date - 2020-09-14T22:08:03+05:30 IST