నల్గొండ జిల్లాలో కాకరేపుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు!

ABN , First Publish Date - 2020-10-01T03:13:22+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పార్టీల మద్దతు కూడగట్టేందుకు...

నల్గొండ జిల్లాలో కాకరేపుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పార్టీల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎలాగైనా మండలికి వెళ్లాలన్న లక్ష్యంతో పట్టభద్రులను ఆకట్టుకునేలా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు అధికార పార్టీ మరోసారి సత్తా చాటేందుకు అధికారగణాన్ని రంగంలోకి దింపింది. హస్తం పార్టీ దాదాపుగా ఒంటరిగానే బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న కమలం పార్టీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.  


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పోటాపోటీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌లో జోష్‌ పెంచుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విస్తృతంగా పర్యటిస్తున్నారు. వామపక్ష అనుబంధ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. 



మొన్నటి వరకు అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు అన్ని ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ ఇప్పుడు తలోదిక్కుగా మారాయి. ఇటీవలే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండటం, తొలిసారిగా పీడీ చట్టం కింద అరెస్టు కావడం, పలు ప్రజాసంఘాల మద్దతు తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.



అధికార టీఆర్‌ఎస్‌ మరోసారి పల్లా రాజేశ్వర్‌ రెడ్డినే కొనసాగిస్తుందా...లేక కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పట్టభద్రుల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరిలో ఫైళ్ల శేఖర్ రెడ్డి, చౌటుప్పల్‌లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఆదేశిస్తే తాను పోటికి సిద్ధంగా ఉన్నానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సై అంటున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల దగ్గర తన మనసులో మాటను బయటపెట్టినట్లు సమాచారం. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 



నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధపడాలని కాంగ్రెస్‌ దాదాపు నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌కు మద్దతు ఇవ్వకూడదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆయా జిల్లాలకు చెందిన ముఖ్యనాయకులతో సమావేశం జరిగింది. కోదండరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ... చివరకు మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికొచ్చినట్లు పార్టీ నేతలు అంటున్నారు. త్వరలోనే నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తృతంగా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, జి.మనోహర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిస్తున్నాయి. పట్టభద్రుల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ..పలు ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీపీఎం, సీపీఐల నుంచి పోటీపై ఎలాంటి స్పష్టత లేదు. యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణిరుద్రమ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ వ్యక్తిగత సహాయకుడైన యాదాద్రి జిల్లాకు చెందిన సుదగాని హరిశంకర్‌ గౌడ్‌ పోటీకి సిద్ధమయ్యారు. సుధగాని ఫౌండేషన్‌ తరఫున రెండేళ్లుగా ఈయన యాదాద్రి, వరంగల్‌ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోదాడకు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా ఈ స్థానం నుంచి ఎవరు సత్తా చాటుతారు? ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి. 

Updated Date - 2020-10-01T03:13:22+05:30 IST