ఆత్మాహుతికి యత్నించిన నాగులు మృతి

ABN , First Publish Date - 2020-09-13T06:55:07+05:30 IST

అసెంబ్లీ సమీపంలోని రవీంద్ర భారతి వద్ద పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న నార్లకంటి నాగులు (55) మృతి చెందారు.

ఆత్మాహుతికి యత్నించిన నాగులు మృతి

ఉస్మానియాలో చికిత్స పొందుతూ కన్నుమూత

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: సంజయ్‌, పొన్నం


ఆమనగల్లు/మంగళ్‌హాట్‌/ఖైరతాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమీపంలోని రవీంద్ర భారతి  వద్ద పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న నార్లకంటి నాగులు (55) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన నాగులు.. ‘తెలంగాణ వస్తే మా బతుకుల మారిపోతాయని అనుకున్నా.. కాని ఏ మార్పూ రాలేదు.. సీఎం కేసీఆర్‌ గారూ కనికరించండి.. మమల్ని ఆదుకోండి.. జై తెలంగాణ..’ అని పెద్దగా అరుస్తూ  ఈ నెల 10న ఆత్మహత్యాయత్నం చేశాడు. 


అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ పరిధిలోని అహ్మద్‌గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీలోని నివాసానికి నాగులు మృతదేహాన్ని తరలించారు. నాగులుకు భార్య స్వరూప, కుమారుడు రాకేష్‌, కూతురు స్నేహలత ఉన్నారు. 
ప్రభుత్వ వైఫలం వల్లే..


నాగులు ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. త్యాగాల తెలంగాణలో ఫలితాలు ఒక్క కుటుంబానికే దక్కుతున్నాయని.. నాగులు మృతి ప్రభుత్వ హత్యేనని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

నాగులు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నాగులును మంచి ఆస్పత్రికి తరలించాలని  కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. 


Updated Date - 2020-09-13T06:55:07+05:30 IST